Sriram Sagar | ముప్కాల్ (మెండోరా), జూన్ 8: తెలంగాణలోని వేల కుటుంబాలకు ఆధారం.. 18 లక్షలకు పైగా ఎకరాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్ ఎండిపోయింది. కేవలం 1056.30 అడుగుల (6.39 టీఎంసీలు) నీటిమట్టంతో ఎస్సారెస్పీ మైదానాన్ని తలపిస్తున్నది. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయిందన్న నివేదిక ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటిదాకా ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. పూడిక కారణంగా ఇప్పుడది 80 టీఎంసీలకు పడిపోయినట్టు తెలుస్తున్నది.
1960వ దశకంలో గోదావరి నదిపై బహుళార్థ సాధక ప్రాజెక్టుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నది. గత డిసెంబర్ వరకూ నిండుకుండగా తొణికిసలాడిన ఈ జలాశయంలో ప్రస్తుతం 1056.30 అడుగులు (6.39 టీఎంసీలు) మాత్రమే నీరున్నది. ఇందులోంచి తాగునీటి అవసరాలకు 231 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 10, ఆవిరి రూపంలో 245 క్యూసెక్కులతో కలిపి నిత్యం 486 క్యూసెక్కుల నీరు తగ్గిపోతున్నది. నిరుడు ఇదే సమయానికి 14.77 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నది. ప్రణాళికారహితంగా నీటిని వదిలేయడం వల్లే ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం తగ్గిపోతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నూట పన్నెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీలోకి దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున పూడిక చేరింది. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 90 టీఎంసీలని చెప్తున్నప్పటికీ, అంతకంటే తక్కువగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. శ్రీరాంసాగర్లో స్టోరేజీ కెపాసిటీ ఆధారంగా 18 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోవడంతో చివరి ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాలం కాకపోతే గోదావరికి వరదలు రావు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండదు. గతంలో ఇటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. పునరుజ్జీవ పథకంలో భాగంగా రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరిని శ్రీరాంసాగర్కు తరలించారు. నిరుడు ఐదు పంపుల ద్వారా 2.54 టీఎంసీలను శ్రీరాంసాగర్కు తరలించారు. తద్వారా వేలాది కుటుంబాలకు తాగునీరు, 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా భరోసా కల్పించారు.