మోర్తాడ్, ఫిబ్రవరి 4 : లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్సారెస్పీ ద్వారా యాసంగిలో 7.56 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఆయకట్టుకు ఏడు విడుతల్లో 63.86 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు గత డిసెంబర్ 25 నుంచి ఇప్పటిదాకా కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు 33 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, సోమవారం నాటికి 1080.8 అడుగులు (47.25 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. కాకతీయ కాలువ నుంచి ఎగువ మానేరు వరకు రెండు జోన్లుగా విభజంచి వారబందీ ప్రకారం నీళ్లను వదులుతున్నారు. జోన్-1 పరిధిలో డీ-1 నుంచి డీ-53 వరకు, జోన్-2 పరిధిలో డీ-54 నుంచి డీ-94 వరకు నీళ్లిస్తున్నారు. జోన్-1కు వారం, జోన్-2కు ఎనిమిది రోజులపాటు నీటి విడుదల చేస్తున్నారు. తద్వారా నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆయకట్టుకు ఢోకా లేకుండాపోయింది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. మూడు రోజుల క్రితం వరద కాలువ హెడ్ రెగ్యులేటర్లను మూసివేశారు. మరోవైపు, సరస్వతీకాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ నిర్మల్ జిల్లాకు సాగునీటిని అందిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు పలు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తున్నారు. గుత్ప, అలీసాగర్, వేంపల్లి, బోదెపల్లి, నవాబ్, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల ద్వారా యాసంగి పంటలకు నీటిని అందిస్తున్నారు. లక్ష్మి కాలువకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ, కాలువ పరిధిలోని డీ1 నుంచి డీ 4 ద్వారా పంటలకు నీళ్లందిస్తున్నారు. వేంపల్లి ఎత్తిపోతల ద్వారా 140 క్యూసెక్కులు, బోదెపల్లి ఎత్తిపోతల ద్వారా 16, నవాబ్ ఎత్తిపోతల ద్వారా 39, అర్గుల్ రాజారాం ఎత్తిపోతల రెండు పంపుల ద్వారా 270 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి పంటలకు అందిస్తున్నారు.