హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): యాసంగి పంటల సాగు విస్తీర్ణంలో తగ్గుదల కనిపిస్తున్నది. గత యాసంగితో పోల్చితే ఇప్పటివరకు సుమారు 4 లక్షల ఎకరాల్లో తగ్గుదల నమోదైంది. వ్యవసాయ శాఖ బుధవారం పంటల సాగుపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.
నిరుడు యాసంగిలో ఇదే సమయానికి మొత్తం 45.96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ప్రస్తుతం 42.21 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వరి సాగు భారీగా తగ్గుదల కనిపిస్తున్నది. మొత్తం 4 లక్షల ఎకరాల్లో వివిధ పంట సాగు తగ్గితే ఇందులో ఏకంగా 3 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. నిరుడు ఇదే సమయానికి 33.25 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ప్రస్తుతం 30.43 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఒక్క జొన్న పంట తప్పా మిగిలిన అన్ని ప్రధాన పంటల సాగు విస్తీర్ణం తగ్గింది.
55 లక్షల ఎకరాలకే పరిమితం?
నిరుడు యాసంగిలో మొత్తంగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో మాత్రం 55 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు తగ్గుదలకు ప్రభుత్వం సాగునీరు అందించకపోవడమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్‌డ్యాంలు నింపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే పంటల సాగు విస్తీర్ణం తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి.
