Movie Ticket Price | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ ధరల పెంపుదల హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. టికెట్ ధరలు పెంచరాదని ఆదేశాలు జారీచేసిన తరువాత కూడా ‘మన శంకరవరప్రసాద్’ సినిమాకు ఎలా పెంచుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. టికెట్ ధరల పెంపునకు నిర్ణయం తీసుకొని మెమో జారీచేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మన శంకరవరప్రసాద్ సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని కోర్టు ధికరణగా పేర్కొంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.
రాజాసాబ్ సినిమాతోపాటు ఈ సినిమాకు కూడా ఒకేరోజు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీచేసిన విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలు ఈనెల 8న జారీచేస్తే.. ఈ నెల 10 వరకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు అప్లోడ్ చేయలేదని ప్రశ్నించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి సీవీ ఆనంద్‌కు కోర్టు ధికరణ కింద నోటీసులు జారీచేయాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మంగళవారం రిజిస్ట్రీని ఆదేశించారు. మన శంకరవరప్రసాద్ సినిమా టికెట్ల ధరల పెంపు మెమో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వెళ్లిన కారణంగా దానిని కూడా ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీచేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు నిర్ణయం సినిమా విడుదలకు 90 రోజుల ముందే చేయాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మన శంకరవరప్రసాద్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాలు చేస్తూ న్యాయవాది జీ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి మూడుకు వాయిదా వేశారు.
ఇది ఉద్దేశపూర్వక ఉల్లంఘన
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజాసాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసిన రోజునే మన శంకరవరప్రసాద్ సినిమాకు కూడా ప్రభుత్వం ధరల పెంపునకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇకపై సినిమా టికెట్లు ధరలు పెంచరాదని ఈ నెల 8న హైకోర్టు ఆదేశాలు జారీచేసిన తర్వాత కూడా ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తగిన వివరణ ఇవ్వలేదు. దీంతో న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని 90 రోజుల ముందే తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్-7 ప్రకారం టికెట్ల పెంపుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవడానికి వీలుందని తెలిపారు.