హైదరాబాద్, డిసెంబర్17(నమస్తే తెలంగాణ) : హర్యానాలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించి వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని హస్తంపార్టీ డిమాండ్ చేసింది. ఫిరాయింపు చట్ట ప్రయోగానికి సాంకేతికత కంటే నైతికతే ప్రామాణికమని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు సూచించింది. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగ రక్షకుడిని తానే అన్నంత బిల్డప్‌తో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాష్ర్టాలు తిరుగుతూ ఫొటోలకు పోజులిస్తుంటారు. తీరా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు వచ్చే సరికి నాలుక మడతేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజకీయ నైతికతను పక్కన పెట్టి, సాంకేతిక కారణాలను చూపుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ రాజకీయ సౌలభ్యం కోసం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.
కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు గోడ దూకినట్టు నిర్ధారించేందుకు తగినన్ని భౌతిక ఆధారాలు లేవని, సాంకేతికంగా వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పీకర్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)పై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను నిరూపించడానికి అవసరమైన ఆధారాలను సమర్పించలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భాలను పార్టీ మారినట్టుగా పరిగణించలేమని, వారిపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నరసింహాచార్యులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ ఈ పిటిషన్లను తోసిపుచ్చారని స్పష్టంచేశారు. అసెంబ్లీ వెబ్సైట్లో వివరణాత్మక ఉత్తర్వులను అప్లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ధర్మాసనాన్ని తప్పుతోవ పట్టించే వ్యూహం
10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరుపకుండా శాసనసభ స్పీకర్ నెలల తరబడి సాగదీసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుదారులను విచారించి వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యాన్ని ఆక్షేపించారు. స్పీకర్ సాగదీత ధోరణిపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫిరాయింపుపై మూడు నెలల్లో తేల్చాలని తొలుత జూలై 31న ఆదేశించింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. నవంబర్ 17న మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
తెలంగాణ శాసనసభ స్పీకర్ కోర్టు ధికరణకు పాల్పడ్డారని సీరియస్ అయ్యింది. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని, లేదా నూతన సంవత్సర వేడుకలు ఎకడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ నెల 18(గురువారం)లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. తీర్పు వెల్లడించకపోతే కోర్టు ధికరణ చర్యలు ఎదురొనే ప్రమాదం ఉన్నది. కాబట్టి స్పీకర్ హడావుడిగా తీర్పు వెలువరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులివ్వగా, ఇప్పటివరకు 8 మందే సమాధానమిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్‌ను కలిసి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కోరారు. దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదంతా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ వ్యూహమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇది రాజ్యాంగ విరుద్ధమే
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విసృ్తతమైన ఆధారాలు, సాంకేతిక వివరాలను స్పీకర్ రికార్డులో ఉంచినా ‘తగినంత సాక్ష్యాలు లేవు’ అనే కారణంతో ఐదుగురు ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా అఫిడవిట్లు, ఫొటోలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, అనేక నెలలుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని స్పష్టంగా నివేదించినా అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా స్పీకర్ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్తోనే ఉన్నారని పేర్కొనడంపై రాజ్యాంగ నిపుణలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల తరఫున ఫిరాయింపు ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రచారం చేశారు. అయినా స్పీకర్ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారని అనర్హత పిటిషన్లను తిరస్కరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్న చర్చ జరుగుతున్నది.
సుప్రీంకోర్టు గడువుకు ఒక్కరోజు ముందు ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కారం నుంచి స్పీకర్ తనను తాను కాపాడుకొనే చర్య అని రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పీకర్ కార్యనిర్వాహక శాఖకు కవచంగా పనిచేస్తారా? అసెంబ్లీ పవిత్రతను కాపాడుతారా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఆయన నిర్ణయం విస్మయానికి గురిచేసిందని, ఇది రాహుల్ గాంధీ ఆశయాలకు గొడ్డలిపెట్టు అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ బ్యూరోక్రాట్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా తాను పార్టీ మారలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం వివరణ ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ పంపారు. ఈ క్రమంలో నేడు మరో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువడనుండగా సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
కండువాలు కప్పుకున్నా.. ఆధారాలు కావట!
నిద్రపోతున్న వారిని లేపవచ్చు. కానీ నిద్ర నటించే వారిని లేపటం ఎవరి తరం కాదు. పార్టీ ఫిరాయింపుల విషయంలో వెలువడిన నిర్ణయం ఇలాంటిదే. దీనికి భిన్నంగా ఏదో జరుగుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. ఒక పార్టీ టికెట్‌తో గెలిచి ఇంకో పార్టీ కండువాను పళ్లికిలిస్తూ వేయించుకుంటున్న ఫొటోలు పత్రికల్లో వచ్చాయి. ఫలానా వారు ఆ పార్టీలో చేరారు అని వార్తలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రచారాలు చేసిన ఆధారాలున్నాయి. ఆ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న ఆధారాలున్నాయి. అధికార పార్టీలో చేరుతున్నా..అనే ప్రకటలున్నాయి. అయినా సరే. అవి ఆధారాలు కాలేక పోయాయి. మంత్రులతో చెట్టపట్టాలు వేసుకు తిరిగిన ఆధారాలున్నాయి. అధికార పార్టీ సభలకు ఏర్పాట్లు చేసిన ఆధారాలున్నాయి. తాము గెలిచిన పార్టీని, ఆ పార్టీ నేతలను దూషించిన ఆధారాలున్నాయి. అయినా సరే… అవన్నీ పార్టీ మారినట్టు కానే కాదు. ఏమో…తాతాచార్యుల ముద్రల్లాంటి ఆధారాలుంటే తప్ప పార్టీ ఫిరాయించినట్టు కాదేమో. కొన్ని వ్యవస్థలకు రాజ్యాంగం ఇచ్చిన కవచకుండలాల రక్షణ ఆధారంగా.. పార్లమెంటు చట్టాలను, న్యాయస్థానాల తీర్పులను కూడా బుల్డోజ్ చేయగల అవకాశం ఉంది.
వర్తమానంలో ప్రజాజీవితంలో నైతిక విలువలు పూర్తిగా లుప్తమైన స్థితిలో ఇలాంటి అనైతికత ఓడుతుందని నైతికత గెలుస్తుందనీ ఎదురుచూడటం అత్యాశే. ‘ఈ పార్టీ ఫిరాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పునుబట్టి ఏ పార్టీనుంచి నిలబడితె ఆ పార్టీకి అండదండలుగా ఉండాలె. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరడం సరికాదు’ అనే చిలకపలుకులు విలేకరుల ముందు వల్లించిన వాళ్లంతా దాన్ని ఆచరణలో పెడతారని అనుకోవడం ఒక భ్రమ. ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్‌కు పొత్తు కుదరదు. రాజ్యాంగాన్ని రూపొందించిన కాంగ్రెస్ పార్టీయే ఆ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి దేశంలో ఎమర్జన్సీ పెట్టింది. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడంలో ఆ పార్టీ రికార్డును సమీప భవిష్యత్తులో ఎవరూ బ్రేక్ చేయలేరు. పార్టీ ఫిరాయింపుల నిషేధ బిల్లును తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. దాన్ని ఎక్కడన్నా పాటించిందో లేదో సమాచారం లేదు. మొన్నటి వరకూ రాహుల్ ఒక్కడే రాజ్యాంగం మినీప్రతిని పట్టుకుని తిరిగేవాడు. ఈ మధ్య ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన బహిరంగ సభలో ఖర్గేతో సహా వేదికనెక్కిన వారంతా ఆ పుస్తకాన్ని ప్రదర్శించారు. ఆ పుస్తకంలో పార్టీ ఫిరాయింపు మీద ఏమని రాసుందో అందులో ఏ ఒక్కరైనా చూసి ఉంటారా?
40 ఏండ్ల క్రితం రాజీవ్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి, తనయుడి నేతృత్వంలోని అదే పార్టీ తూట్లు పొడుస్తున్నది. రాహుల్‌గాంధీ పట్టుకుని తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా.. తెలంగాణలో ప్రజాస్వామ్యం వెర్రిచూపులు చూస్తున్నది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యల విషయంలోనూ ప్లేటు ఫిరాయించిన విషాద దృశ్యం రాష్ట్రంలో కనిపిస్తున్నది.
ఊహించిందే జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడితో, కదలక తప్పని పరిస్థితిలో, గోడదూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్.. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తేల్చేసింది. వాళ్లు కాంగ్రెస్‌లో చేరలేదట. బీఆర్ఎస్లోనే ఉన్నారట. కండ్లముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ నమ్మబలుకుతున్నది.
పిల్లి కండ్లు మూసుకుని పాలుతాగి.. ఎవరూ చూడలేదనుకోవడం భ్రమ. ఖాళీ అయిన గిన్నె, మూతికంటిన మీగడ దొంగతనాన్ని పట్టిస్తుంది. పదిమంది ఎమ్మెల్యేలు గోడదూకిందీ నిజం. కాంగ్రెస్‌లో చేరిందీ, కండువాలు కప్పుకున్నదీ నిజం. దిగిన ఫొటోలు, మాట్లాడిన వీడియోలు ప్రజలందరూ చూసిందీ నిజం. కానీ.. అవన్నీ అబద్ధాలన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉన్నది. వచ్చిన తీర్పు అట్లనే ఉన్నది.
ఇదీ కాంగ్రెస్ ప్రవచిత రాజ్యాంగ రక్షణ! మేడిపండు ప్రజాస్వామ్య పరిరక్షణ!! ‘న్యాయ్‌యాత్ర’ల సూక్తి ముక్తావళి మాటున సంవిధాన్ కీ సంహార్!!
ప్రజాస్వామ్యమా.. వర్ధిల్లు!!