సిద్దిపేట : ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి, రుచికరమైన, అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కనీ గొర్రెలను అధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రెలకు నట్టల నివారణ మాత్రలు వేసి.. దక్కని జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులు, క్షేత్ర సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జిల్లా ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన దక్కని గొర్రెల మాంసాన్ని అందించేందుకు సిద్దిపేట పట్టణంలోని నాన్వెజ్ మార్కెట్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన గొల్ల, కురుమలు దక్కనీ గొర్రెల మాంసాన్ని విక్రయించాలన్నారు. గొర్రెలు ఆరోగ్యంగా పెరిగేందుకు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నామన్నారు.

జిల్లాలో 51 బృందాల ద్వారా 8 లక్షల 94 వేల గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తామన్నారు. ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే పామాయిల్ సాగును రైతులు చేపట్టాలని ఆయన సూచించారు. మిట్టపల్లి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉందన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్స్ ను అందజేస్తాం.
ఉచితంగా పామాయిల్ మొక్కలను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక దిగుబడి పొందేందుకు రైతులు ముందుగా పచ్చిరొట్టను పండించాలన్నారు. అలాగే పంట మార్పిడి చేయాలి.
పట్టు పురుగుల పెంపకం చేపట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బాలరాజు, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.