Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాలు సమ్మిట్ వేదికగా బట్టబయలయ్యాయని తెలిపారు. తెలంగాణ అసాధారణ ఆర్థిక వృద్ధికి సంబంధించి యూకే మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంగళవారం ఎక్స్ వేదికగా హరీశ్ స్పందించారు.
‘నిజం అరవదు. అది మౌనంగా బయటకొస్తది. ఆ వెంటనే ప్రతి అబద్ధం కుప్పకూలిపోతది. ఈ రోజు ఆ నిజం స్పష్టంగా వెల్లడైంది.. ఆ నిజం ఏమిటంటే.. తెలంగాణ జీఎస్డీపీ దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అంగీకరించడం! తెలంగాణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ధ్రువీకరించడం! రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ప్రతి అబద్ధాన్ని ఈ నిజాలు ధ్వంసం చేశాయి. ఎంత పీఆర్, వాక్పటిమ, కల్పిత కథనాలతో ప్రచారం చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను దాచడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. జై తెలంగాణ! జై కేసీఆర్!’ అని హరీశ్ పేర్కొన్నారు.