బాన్సువాడ (కామారెడ్డి జిల్లా) : జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam) పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల(Decade celebrations) నిర్వాహణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం బాన్సువాడ పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. జూన్ 2 న మొదటి రోజు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.జూన్ 3 నుంచి వివిధ శాఖల ద్వారా ప్రతి రోజూ ఒక్కో అంశంపై ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.‘ఆశించిన ఫలితాలు రావాలంటే ప్రజాప్రతినిధులు కష్టపడి పని చేయలి, అధికారులను అప్రమత్తం చేయాలని’ పేర్కొన్నారు.
శాసనసభ్యులు కష్టపడి పనిచేస్తే క్షేత్ర స్థాయిలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ‘ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది.చేసిన పనులను ప్రజలకు వివరించడం అందరి బాధ్యత’ అని గుర్తు చేశారు. రైతు బీమా(Raitu Beema) అందుకున్న రైతుల కుటుంబాలను పిలవాలి.పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను, మండలాలను, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో జరిగిన మేలును వివరించాలని కోరారు.
ఎన్టీరామారావు ప్రారంభించిన సంక్షేమ రంగాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో 2014 లో 1.08 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే నేడు 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.