Telangana | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటి మిత్తీలు చెల్లించేందుకు రాష్ట్ర ఆదాయం మొత్తం పోతున్నది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.1.53 లక్షల కోట్లు చెల్లించినం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కహానీ బూటకమని తేలింది. అసలు వాస్తవాలను ప్రభుత్వమే బడ్జెట్లో స్వయంగా వెల్లడించింది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.30,847.37 కోట్లు మాత్రమే చెల్లించినట్టు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు.
ఇందులో అసలు రూ.13,117.60 కోట్లు కాగా, మిత్తీ కింద రూ. 17,729.77 కోట్లు చెల్లించినట్టు స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ… 14 నెలల్లో రూ.1,58,041 కోట్ల అప్పు చేశామని, అందేలో రూ.1,53,359 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కిందే చెల్లించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది కట్టేది రూ.35 వేల కోట్లే
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అసలు, మిత్తీల చెల్లింపుల కోసం రూ.35,217 కోట్లు కేటాయించినట్టు సర్కారు తెలిపింది. రెవెన్యూ ఎక్స్పెండేచర్ కింద వడ్డీల చెల్లింపుల కోసం రూ.19,369 కోట్లు, అసలు కింద రూ.15,848 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కానీ, కాంగ్రెస్ పాలకులు మాత్రం ప్రతి నెల రూ.6,500 కోట్లను అప్పులకు వడ్డీల కింద కడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేశారు. తాజా బడ్జెట్లో నెలకు కేవలం రూ.2,934 కోట్లు మాత్రమే వడ్డీల కింద చెల్లిస్తున్నట్టు సర్కారు స్పష్టం చేసింది.