సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు అనే వ్యక్తి శుక్రవారం ఉదయం మరణించారు. ఆయన స్వస్థలం మహారాష్ట్ర. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను గుర్తించామని, మరో ఏడుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నవారిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 23 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదన్నారు.
మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని హైలెవల్ కమిటీ సిగాచీ పరిశ్రమకు చేరుకున్నది. పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు కూడిన ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. కాగా, గురువారం నిపుణుల కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.