హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : సహజంగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, గాలిదుమారాలు, వ డగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుం టాం. పిడుగును ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ, అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేశంలో సంభవించే అత్యధిక మరణాలకు పిడుగులే కారణం! భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం పిడుగులతో ఏటా దేశం లో 2,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక మేరకు 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 8,060 మరణా లు సంభవించగా వాటిలో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణమని తేలింది. అంటే ప్రకృతి వైపరీత్య మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 358 మంది మృతిచెందగా దీనికి చాలారెట్లు ఎకువగా పిడుగులకు మృత్యువాతపడ్డారు.
ఆ ఏడాది అత్యధికంగా మధ్యప్రదేశ్ (496), బీహార్ (329), మహారాష్ట్ర (239) లో సంభవించాయి. ప్రకృతి విపత్తులతో తమిళనాడులో 93 మరణాలు సంభవించగా వాటి లో పిడుగుపాటు మరణాలు 89 ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 248కి 210, పశ్చిమ బెంగాల్లో 195కి 161 పిడుగులతో సంభవించినవే కావ డం గమనార్హం.
కర్ణాటకలో 140, ఆంధ్రప్రదేశ్‌లో 140, తెలంగాణలో 40 మంది ప్రకృతి విపత్తుల కారణంగా చనిపోగా, 96 మంది పిడుగుపాటుతో కన్నుమూశారు. 2019 నుం చి దేశంలో పిడుగుపాటు మరణాలు 20 నుం చి 35 శాతం మేర పెరిగినట్టు ఐఎండీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కానీ వీటిని ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది.
ముందుగానే గుర్తించే ‘దామిని’యాప్..
పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దామి ని లైటింగ్ అలర్ట్ అనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీపీఎస్ లొకేషన్ తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుం ది. 15 నిమిషాల్లో మనం ఉన్న ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముందో? లేదో? ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది.
2020 లో యాప్‌ను ఐఐటీఎం రూపొందించింది. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గరుంది. ఎర్త్ నెట్వర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సెన్సార్లు ఏర్పాటు చేసి, ఎకడ పిడుగులు పడుతాయో ఓ అంచనాకు వస్తారు. ఫోన్లకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారాన్ని పంపి జనాన్ని అప్రమత్తం చేస్తారు.
గ్రామాల్లోనే మరణాలు ఎక్కువ
పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 2020లో 2,862 మంది, 2021లో 2,880 మంది మరణించారు. గ్రామాల్లోనే 95-96 శాతం పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోల్చితే మన దేశంలో పిడుగుపాటు మరణాలు చాలా ఎకువ. అమెరికాలో ఏటా సరాసరి 20 మరణాలు సంభవిస్తున్నాయి. 2006 నుంచి 2021 వరకు ఆ దేశంలో 444 మంది పిడుగులతో చనిపోయారు.
మన దేశంలో 1967 నుంచి 2019 వరకు లక్ష మంది పిడుగుపాటుకు గురై మరణించారు. ఇది 52 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించిన మరణాల్లో దాదాపు 33 శాతం! అలాగే వరదల కారణంగా సంభవించిన మరణాలకంటే రెం డింతలు ఎకువ! ఐఎండీ గణాంకాల మేరకు ఈశాన్య రాష్ర్టాల్లో అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. కానీ, మధ్యభారతంలోనే పిడుగుపాటు మరణాలు ఎకువగా నమోదవుతున్నాయి. జూలైలో ఉత్తరప్రదేశ్ పిడుగులతో దద్దరిల్లిపోయింది. జూన్, జూలైలో బీహార్‌లో ఏకంగా 50 మంది దాకా మృత్యువాతపడ్డారు. ఆ రెండు రాష్ర్టాల్లో నెల వ్యవధిలోనే పిడుగుల కారణంగా సంభవించిన మరణాలు వందకు పైనే ఉన్నాయి.