ఆత్మకూరు, ఆగస్టు 16: అమెరికాలో ఓరుగల్లు యువకుడు మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఆయన చనిపోయినట్టు శుక్రవారం కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ రాజేశ్ (33) 2015లో ఎమ్మెస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. తొమ్మిది సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం బీపీ, షుగర్ పెరగడంతోపాటు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ విషయాన్ని స్నేహితులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు. దిక్కు తోచని స్థితిలో వారు ఇంటి వద్ద రోదిస్తున్నారు. రాజేశ్ తండ్రి సాంబయ్య 11 నెలల క్రితమే మృతి చెందాడు. తల్లికి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాజేశ్ తల్లి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.