హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, గెల్లు శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పార్టీ నేత కిశోర్గౌడ్తో కలిసి ఫూలే చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. కేసీఆర్ పాలనలో ఆ మహనీయుడికి సముచిత గౌరవమిచ్చారని మధుసూదనాచారి గుర్తుచేశారు. ప్రస్తుత పాలకులు బలహీనవర్గాలను అణచివేస్తూ, అన్యాయాలు, అవహేళనలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఫూలే స్ఫూర్తితో బహుజనులందరూ ఏకమై పాలకుల దురాగతాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17 శాతానికి పరిమితం చేసి ధోకా చేసిందని నిప్పులు చెరిగారు. బీసీలందరూ సంఘటితమై ద్రోహపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే బీసీలకు మేలు జరుగుతుందని దేవీప్రసాద్ స్పష్టంచేశారు. ఈ దిశగా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. బలహీనవర్గాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తున్నదని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించి నిండాముంచిందని విమర్శించారు. బలహీనవర్గాలు సంఘటితమై రేవంత్ సర్కారు కుట్రలను తిప్పికొట్టాలని దూదిమెట్ల బాలరాజ్యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పి ధోకా చేసిన రేవంత్ సర్కారుకు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని కిశోర్‌గౌడ్ కోరారు.