Sathish Reddy | హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. బర్రెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీశ్ రెడ్డి.. బర్రెలకు విజ్ఞప్తి చేశారు.
‘మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్‌గా ఉంటాయి. దయచేసి అటువైపు వెళ్లొద్దు. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోదీ.. వందే భారత్ పేరుతో బర్రెలు, ఆవులు తాకితేనే చిద్రమైపోయే రైళ్లను తీసుకొచ్చారు. అలాంటి రైళ్లతో వాటికే కాదు మీకూ ప్రమాదమే. వాటిని ప్రారంభించడం ఎలాగూ మోదీ ఆపేపరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి మీరైనా అటువైపు వెళ్లకుండా ఉండి ప్రాణాలు కాపాడుకోండి. బంధుమిత్రులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూడండి’ అంటూ బర్రెలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క వందే భారత్ పథకాన్ని ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు దాదాపు 17 సార్లు అంటే 17 రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభించారని చెప్పారు. రైల్వే శాఖ మంత్రి చేయాల్సిన పనిని దేశ ప్రధాని చేయడం సిగ్గుచేటన్నారు. పబ్లిసిటీ పిచ్చితో కేవలం ప్రారంభోత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో మరేదైనా కొత్త ప్రాజెక్టు కట్టే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రైలు కనెక్టివిటీ లేని ప్రాంతానికి కొత్తగా లైన్ వేసే అవకాశం కూడా ఉందని చెప్పారు.
రాష్ట్రానికి పైసా ఇచ్చేది లేకున్నా కేవలం పబ్లిసిటీ కోసమే మోదీ తెలంగాణకు వస్తున్నారని సతీశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి వచ్చి ఏదో ఇచ్చినట్టు షో చేసి తమ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకాలు, దురాగతాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.