కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలోనే అనేక తప్పులు వెలుగులోకి రాగా, తాజాగా నలుగురు అధికారులను తప్పించిన వైనాన్ని ‘విజిలెన్స్ రిపోర్ట్.. కరప్ట్?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో శనివారం బయటపెట్టింది. ఈ కథనం ఇరిగేషన్ శాఖతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోనూ సంచలనం రేపినట్టు తెలుస్తున్నది. కథనంలో ప్రతి వాక్యం నిజమేనని ధ్రువీకరించుకున్న కొందరు ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీయగా, దీని వెనుక దాదాపు రూ.2 కోట్ల డీల్ కుదిరిందని గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. నలుగురు అధికారులను తప్పించేందుకు ఓ కీలక అధికారి రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారంటే..
తప్పుడు నివేదికలు ఇవ్వడానికి ఎన్ని అడ్డదారులు తొక్కారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నలుగురు అధికారులను తప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆ అధికారి.. మిగతా కొంత మంది ఇంజినీర్లను కూడా డబ్బులకోసం బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో లెక్కకు మించిన తప్పులున్నాయంటూ గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించి విచారణ నివేదిక ఇచ్చేటప్పుడు ఎటువంటి లోపాలు లేకుండా నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వాలి. కానీ విజిలెన్స్ ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం విషయంలో మొత్తం 25 మంది అధికారులు పనిచేసినట్టుగా విజిలెన్స్ విభాగం ముందుగా వివరాలు తీసుకున్నది. ఇందులో నలుగురిని మినహాయించి మిగతా వారిపై వివిధ రకాల కేసులను నమోదు చేశారు. కొంతమందికి జరిమానా విధిస్తూ విజిలెన్స్ అధికారులు ఉత్తర్వులను జారీచేశారు.
నలుగురు అధికారులను నివేదిక నుంచి తప్పించడం వెనుక భారీ డీల్ కుదిరిందని తెలుస్తున్నది. ఆ నలుగురిపై క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు లేకుండా ఉండేందుకు రూ.2 కోట్లకు సదరు విజిలెన్స్ అధికారి డీల్ కుదుర్చుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ డబ్బులో ఒక డీఈ మేజర్‌గా భరించడానికి ముందుకొచ్చారని, ఈ కోణంలోనే మిగతా ముగ్గురిని ఆయన తన కోవలో తీసుకెళ్లారని తెలుస్తున్నది. ఆ అధికారి ధనదాహం ఈ డీల్‌తోనే ఆగలేదు. విచారణ సమయంలో మరికొందరు అధికారులను కూడా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తున్నది. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కేసుల తీవ్రత బాగా ఉంటుందని ముందుగా హెచ్చరించినట్టు సమాచారం.
విజిలెన్స్ విచారణ నివేదికలో లోపాలు ఉన్నాయంటూ ఇన్నాళ్లూ వచ్చిన కథనాల్లో వాస్తవాలు లేవంటూ కొందరు అధికారులు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ‘విజిలెన్స్ రిపోర్ట్.. కరప్ట్?’ శీర్షికన నమస్తే తెలంగాణ శనివారం ప్రధాన సంచికలో వచ్చిన ప్రత్యేక కథనం సంబంధిత శాఖల్లో కలకలం రేపింది. ఇన్నాళ్లకు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్న చర్చ ఆ శాఖలో జోరుగా సాగుతున్నది. సదరు అధికారిపై ఇప్పటికైనా సర్కారు చర్య తీసుకుంటుందా? లేదా? అంటూ చర్చలు జరుగుతున్నాయి. అదే అధికారి కక్ష సాధింపునకు బలైన అధికారులు నమస్తే కథనాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించగా, విజిలెన్స్ నివేదిక సమర్పణ వెనుక పెద్ద తంతంగమే జరిగిందని, అధికారులను తప్పించేందుకు రూ.2 కోట్లకు పైగా డీల్ కుదిరిందన్న చర్చ కూడా జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి విచారణ చేయిస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని సంబంధిత శాఖ అధికారులే పేర్కొంటున్నారు.
తప్పించిన ఆ నలుగురు అధికారుల్లో ఒకరైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) వీ సూర్యప్రకాశ్‌పై ఆ శాఖలోని ఇంజినీర్లు భగ్గుమంటున్నారు. విజిలెన్స్ కేసుల విషయంలో ఆయన కన్నా తక్కువ బిల్లులు రికార్డు చేసిన ఇంజినీర్లపై కేసులు పెట్టి.. ఆ అధికారిని మినహాయించారు. ఆయన కన్నా సీనియర్ అధికారులు వందలాది మంది ఉన్నా, వారందరినీ పక్కనబెట్టి ఈఈగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ తీరుపై ప్రస్తుతం ఆ శాఖలో జోరుగా చర్చ సాగుతున్నది. డీఈఈ వీ సూర్యప్రకాశ్ది 2007 బ్యాచ్. ఆయన కన్నా ముందు అంటే 1999, 2004, 2005 బ్యాచ్‌లకు చెందిన దాదాపు 250 మంది సీనియర్ డీఈఈలు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ అధికారులకు పదోన్నతులు ఇవ్వకుండా సూర్యప్రకాశ్‌కు ఉన్నతాధికారులు పెద్దపీట వేశారు. ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పూర్తిస్థాయి అడిషనల్ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మహదేవపూర్ డివిజన్-1లో డీఈఈగా కొనసాగుతూనే మహదేవపూర్ డివిజన్-2కు ఫుల్ అడిషనల్ ఈఈగా కొనసాగుతున్నారు. ఒకవేళ సీనియర్లకు ప్రమోషన్లు ఇచ్చినా ఆ స్థానంలోకి ఎవరూ రాకుండా చూసుకునేందుకు ఈయన ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తున్నది.
విజిలెన్స్ నివేదికలో నుంచి కొంతమంది అధికారులను తప్పించడం వెనుక ఏపీ క్యాడర్‌కు చెందిన ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది. ఆ అధికారి సైతం గతంలో సుదీర్ఘకాలంగా విజిలెన్స్ విభాగంలోనే విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఓ కీలక పదవిలో కొనసాగుతున్నారు. సదరు అధికారి కనుసన్నల్లోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారే ఈ తతంగమంతా కొనసాగించారని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సుదీర్ఘకాలంగా అక్కడే డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయనపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరే ప్రాజెక్టుపై అసంబద్ధమైన రీతిలో ఇష్టారీతిన రిపోర్టును వండివార్చి, అస్మదీయులను, అమ్యామ్యాలను ముట్టజెప్పిన ఇంజినీర్లను రిపోర్టు నుంచి తప్పించారని తెలుస్తున్నది. అందుకు ఇరిగేషన్‌శాఖ అధికారులు పలు అంశాలను ఉదహరిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ హెడ్‌గా ఉన్న సీఈ, దిగువన ఉన్న ఈఈ మీద క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. కానీ సీఈ తర్వాత కీలకమైన క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈని మాత్రం క్రిమినల్ చర్యల నుంచి విజిలెన్స్ మినహాయించింది. క్యూసీ ఎస్ఈ మీద మాత్రం నామమాత్రంగా రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ వెల్లడించింది.
ఈ మినహాయింపు ఎందుకు ఇచ్చింది? సదరు ఎస్ఈ గతంలో విజిలెన్స్‌లో పని చేశారనే ప్రేమతోనా? లేదంటే లోపాయికారి ఒప్పందం కారణమా? అని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎస్ఈదీ కీలక పాత్ర. టెండర్ కాల్ ఫర్ చేయడం, ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవడం వరకూ అన్నింటికీ ఆయనే అధికారిక అధారిటీ. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తికాక ముందే సర్టిఫికెట్ ఇచ్చారని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. కంప్లీషన్ సర్టిఫికెట్ జారీచేసిన 15 రోజుల్లో ప్రాజెక్టును ఎస్ఈ స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది. మరి ఎస్ఈ స్వాధీనం చేసుకున్నారా? చేసుకోలేదా? అనేది విజిలెన్స్ వెల్లడించనేలేదు. స్వాధీనం చేసుకుంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రాజెక్టు మెయింటెనెన్స్ బాధ్యత ఎస్ఈదే. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చి స్వాధీనం చేసుకోకపోవడమే తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనే. కానీ విజిలెన్స్ మాత్రం సదరు ఎస్ఈని మాత్రం బాధ్యుడిని చేయలేదు. ఎందుకు? మిగతా వారినే ఎందుకు? ఏవిధంగా బాధ్యులను చేసిందని ఇరిగేషన్ అధికారులు లేవెనెత్తుతున్న కీలక ప్రశ్న. విజిలెన్స్ నివేదిక పేరిట తెరవెనుక కీలక అధికారి, తెరముందు సదరు అధికారి గుట్టుచప్పుడు కాకుండా భారీగా లావాదేవీలు కొనసాగించారని, కమిషన్ విచారణ బూచి చూపుతూ బేరసారాలు సాగించారని తెలుస్తున్నది.