హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉదయం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇప్పుడే ఈస్థాయిలో ఉంటే ఏప్రిల్, మేనెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గిందని, దీంతో భూమి, గాలిలో తేమశాతం తగ్గాయని.. వేడి పెరగడానికి ఇదో కారణమని పేర్కొన్నారు. నిరుడుతో పోల్చితే ఈఏడాది ఎండల తీవ్రత ఎకువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని సూచించారు.