హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని 20 లక్షల మంది రవాణారంగ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు దయానంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీశారు. రాహుల్‌గాంధీ మెప్పుకోసమే గిగ్ వర్కర్ల ముసాయిదా బిల్లు రూపొందించాలని సీఎం రేవంత్ తహతహలాడుతున్నారని విమర్శించారు. ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రవాణారంగ కార్మికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని.. అందుకోసం సీఎం, మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లామని, కానీ ఫలితం లేదని వాపోయారు.
ట్రేడ్ యూనియన్లను సంప్రదించకుండా ప్రభుత్వం గిగ్‌వర్కర్ల ముసాయిదా బిల్లుపై ముందుకుపోవడం సరికాదని మండిపడ్డారు. ఏడాదిన్నరగా డ్రైవర్ల సమస్యలను పెడచెవిన పెడుతున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఓవైపు గిరాకీలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కనీసం ఆ చావులపై స్పందించడానికి కూడా సీఎం రేవంత్‌కు సమయం దొరకకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినైనా.. మొదటగా రవాణారంగ కార్మికుడినని పేర్కొన్నారు. ఈనెల 22న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.