Congress Govt | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఆధారంగానే వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా సర్వే ప్రశ్నావళిని రూపొందించిందని, దీంతో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఇంటింటి సర్వే డాటాయే కీలకంగా మారనున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరు నుంచే ఈ సర్వేను ప్రారంభించేందు కు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రణాళికా విభాగం.. డాటా కలెక్షన్‌కు ఎన్యుమరేటర్లను ఎంపిక చేయడం, శిక్షణకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించడంలో నిమగ్నమైంది.
55 ప్రశ్నలతో ప్రొఫార్మా
ఇంటింటి సర్వేకి సంబంధించిన ప్రశ్నావళిని ప్రణాళికా విభాగం ఇప్పటికే రూపొందించింది. మొత్తం 55 ప్రశ్నలతో ప్రొఫార్మాను సిద్ధం చేసింది. కుటుంబ పెద్ద, సభ్యుల వివరాలతోపాటు వారి ఇండ్లు, స్థలాలు, వాహనాలు, వృత్తి, పశువులు, స్థిరచరాస్తులు, తాగునీటి కనెక్షన్లు, వంటగ్యాస్, ఇంటి కోసం తీసుకున్న రుణాలు తదితర వివరాలన్నింటినీ సేకరించేలా ఈ ప్రశ్నలను రూపొందించింది. రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల కుటుంబాల డాటా సేకరణకు 90 వేల మంది ఎన్యుమరేటర్లు, సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు 12,500 మంది సూపర్వైజర్లు అవసరమవుతారని ప్లానింగ్ బోర్డు ఇప్పటికే అంచనా వేయడంతోపాటు వారి నియామకాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
3 దశల్లో డాటా సేకరణ
మూడు దశల్లో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్లానింగ్ బోర్డు.. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లకు 3 వారాల చొప్పున సమయాన్ని కేటాయించేందుకు, థర్డ్ ఫేజ్‌లో డాటాను ప్రాసెస్ చేసి సదరు నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఫస్ట్ ఫేజ్‌కు కేటాయించే 3 వారాల్లో ఒక వారం సర్వే అవసరాలకు ఉద్దేశించిన హౌజ్ లిస్టింగ్, స్టీరింగ్ కమిటీ నియామకం, ప్రశ్నావళి పరిశీలన, మాన్యువల్ తయారీ, జిల్లా కలెక్టర్లతో సమావేశాలు, ఎన్యుమరేషన్ బ్లాక్‌ల ఏర్పాటు, మాస్టర్ ట్రెయినర్లతోపాటు ఎన్యుమరేటర్లకు, సూపర్ వైజర్లకు శిక్షణ, డిజిటల్ యాప్ తయారీ, ప్రయోగాత్మక వినియోగం తదితరాలు ఉంటాయి. మిగిలిన రెండు వారాల్లో సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలను సేకరిస్తారు. మొదటి వారంలో జరిగే ప్రక్రియ కోసం ప్రతి నలుగురు ఎన్యుమరేటర్లకు ఒకరు చొప్పున, ఆ తర్వాతి రెండు వారాల్లో ప్రతి 8 మంది ఎన్యుమరేటర్లకు ఒకరు చొప్పున సూపర్వైజర్లను నియమించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 80 కుటుంబాల చొప్పున 2 వారాలపాటు డాటా సేకరించేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
ఫస్ట్ ఫేజ్‌లోని మూడు వారాల పనులు సమాంతరంగా జరిగేలా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. 2వ ఫేజ్‌లోని మూడు వారాల వ్యవధిలో ప్రజల నుంచి సేకరించిన డాటాను పరిశీలించి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డాటా సేకరణలో ఎలాంటి తప్పులు, లోపాలు, పొరపాట్లకు ఆసారం లేకుండా మొత్తం 55 ప్రశ్నలను క్రాస్ చెక్ చేస్తారు. ఇందుకోసం ఈ ఫేజ్‌లోని మొదటి రెండు వారాలను కేటాయించుకుని, చివరి (మూడవ) వారాన్ని మిస్ అయిన ఇండ్ల నుంచి వివరాలను సేకరించడం, వారి నుంచి తీసుకున్న అంశాలను ప్రింటవుట్ తీసి వారికి అందజేయడం, మరో కాపీ మీద వారి నుంచి సంతకాలు తీసుకుని ఫైలింగ్ చేయడం తదితరాలకు వినియోగించనున్నారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలను సూపర్ వైజర్లు కూడా పర్యవేక్షించనున్నారు. అలా సేకరించిన డాటాను 3వ ఫేజ్‌లో కంప్యూటరీకరణ చేయనున్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, డిజిటల్ యాప్‌లలో అప్లోడ్ చేసి గ్రామాలవారీగా డాటా బేస్ సిద్ధం చేయనున్నారు. ఆ రెండు వారాల వ్యవధిలోనే మొత్తం కులాలు, కుటుంబాలు, ఆర్థిక అంశాలు, వాటన్నింటితో కూడిన నివేదికను ప్రణాళికా విభాగం సిద్ధం చేయనున్నది. మొత్తంగా డిసెంబరు 9లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది లక్ష్యం.
డాటా ఆధారంగానే 6 గ్యారెంటీలు
ఇంటింటి సర్వేలో సేకరించే వివరాలను రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి వినియోగించే అవకాశమున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ సర్వేలో ప్రతి వ్యక్తి కులం, ఉపకులం, మతం, ఆధార్ నంబర్, ఓటరు గుర్తింపుకార్డు నంబర్, అంగవైకల్య ధ్రువీకరణ, కుటుంబసభ్యుల సంప్రదాయ వృత్తి, ఉపాధి, నెలవారీ జీతం, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగం, వృత్తితో వస్తున్న వ్యాధులు, కూలీలు/కార్మికులైతే వారి రోజువారీ వేతనం, వార్షిక ఆదాయం, ఆదాయ పన్ను చెల్లింపు, బ్యాంకు ఖాతా నంబర్, కుటుంబానికున్న సాగుభూమి విస్తీర్ణం, పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? లేదా? ఎలాంటి ఇంటిలో నివసిస్తున్నారు? టాయిలెట్ సౌకర్యం, తాగునీటి కనెక్షన్ ఉన్నాయా? లేవా?, వాడుతున్న వాహనాలు, ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన రాజకీయ అవకాశాలు తదితర వివరాలను సేకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుతోపాటు ఇతర అన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ డాటానే ప్రామాణికంగా తీసుకోనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.