హనుమకొండ, నవంబర్ 3: గత ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. ఆదివారం హనుమకొండ జిల్లా వడ్డెపల్లిలోని తన నివాసంలో ఆయన ఆటోకార్మిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పూర్తిస్థాయిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. రోడ్డునపడ్డ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పటికే కొందరు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలు అమలు చేయలేక అసహనంతో ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టంచేశారు. 300 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక వర్గ ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న10 లక్షల మంది అసంఘటిత ఆటో కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల భృతి ఇవ్వాలని, ఆటో కార్మికుల కోసం కార్మిక బోర్డు ఏర్పాటు చేయాలని, చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న హైదరాబాద్ ఇందిరా పార్ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.