హనుమకొండ నవంబర్ 13 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. కాకతీయ యూనివర్సిటీ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రాంగణంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగోరోజు ధర్మదీక్షకి వినయ్‌భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేంతవరకు కూడా బీసీలు నిరంతరం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీలకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకపోవడం వలన తీవ్రమైన నష్టం కలిగిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడిని పెంచి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తే తప్ప ఇది సహకారం కాదన్నారు. బీసీ సంఘాల నాయకులని బీసీ రాజకీయ నాయకులని అందరిని కూడా అఖిలపక్షంలో భాగస్వామ్యం చేసి రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం పైన పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడితేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహకారమవుతుందన్నారు.
ఆ సహకారం కావాలని ముందుగా కోరుకున్న వ్యక్తుల్లో నేను మొదటివాడని అన్నారు. బీసీలందరూ ఒక్కతాటిపై ఉండి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగంలో అమలయ్యేవిధంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం దీక్షలో కూర్చున్న బీసీ విద్యార్థి జేఏసీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు నాగరాజ్ పటేల్, తిరుపతి, అజయ్‌సింగ్, సుమన్ రాజ్, అన్వేష్, రవితేజ, రాజశేఖర్, బోస్కా నాగరాజు, సాయి కృష్ణ, రాజేష్ బీఆర్ఎస్వీ నాయకులు శరత్ గౌడ్, రాజేష్, ప్రశాంత్, వీరస్వామి, అనిల్ పాల్గొన్నారు.