హనుమకొండ చౌరస్తా, జూలై 8 : దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా కార్మిక సంఘాలన్నీ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లోని వాణిజ్య, వ్యాపార సముదాయాలో పనిచేస్తున్న కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థల్లో ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొనే విధంగా సహకరించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు హరించివేస్తున్నాయన్నారు. ప్రపంచీకరణ తర్వాత అనేక చట్టాలనుబిజెపి ప్రభుత్వం రద్దుచేసి కార్మికుల హక్కులను కాల రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చి మళ్లీ విరమించుకోవడం, జీవో 282 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పనిగంటలు పెంచడం సరైంది కాదన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిరు వ్యాపారులకు చట్టం తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ, నగర అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులపై దౌర్జన్యాలు చేస్తున్నారు.
కార్పొరేషన్ అధికారులు చిరు వ్యాపారుల జోలికి రావొద్దన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా కార్మికుల సమ్మెలో పాల్గొనే విధంగా సహకరించాలని వినయ్ భాస్కర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు రాగుల రమేష్, ఉప్పలయ్య, నున్న అప్పారావు, సారంగపాణి, బిక్షపతి, సంజీవ్ పాల్గొన్నారు.