హనుమకొండ, అక్టోబర్ 3: మంత్రి కొండా సురేఖది నీచ రాజకీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై మంత్రి చేసిన అసత్య ఆరోపణల నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్‌తో కలిసి దాస్యం మీడియాతో మాట్లాడారు. మంత్రి సురేఖ వెంటనే కేటీఆర్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేటీఆర్‌పైకి నెట్టడం సరికాదని, ఆమె మాటలను మహిళా లోకమంతా ఖండిస్తున్నదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మంత్రి సురేఖ అనాలోచిత మాటలకు మహిళలు బాధపడుతున్నారని అన్నారు.
కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సిందే
కేతేపల్లి, అక్టోబర్ 3 : అధికారంలో ఉన్నామనే అహంకారంతో సినీనటి సమంత వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను వెంటనే మత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గవర్నర్‌ను కోరారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా కేతేపల్లిలో మీడియాతో మాట్లాడారు. సురేఖ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సమంతతోపాటు మాజీ మంత్రి కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.