వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.85 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన కాళోజీ కళాక్షేత్రంలోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (సెప్టెంబర్ 9) కాళోజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌లోని కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తుది మెరుగులు దిద్దే పనులు పూర్తి కాకపోవడం, వానల కారణంగా సీఎం పర్యటన రద్దయ్యింది.
కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళా క్షేత్రాన్ని చూసేందుకు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లారు. భవన నిర్మాణం, పనులను చూస్తున్న క్రమంలో సుబేదారి పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాస్‌రెడ్డి మరో ఇద్దరు ఎస్సైలు, పది మంది సిబ్బందితో అక్కడికి వచ్చారు.
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. వెంటనే వెళ్లకపోతే తమ పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కూడా అదే రీతిలో స్పందించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇలాంటి పోలీసు బెదిరింపులను చాలా చూశాం. కేసులు, పదవులు మాకు కొత్త కాదు. రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినం. ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణాన్ని చూసేందుకు వచ్చిన మాతో ఇలా వ్యవహరించడం సరికాదు. మీరు ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారో అందరికీ తెలుసు. మేం ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో లేము.
కాళోజీ కళా క్షేత్రం వద్ద రాజకీయాలు తగదు. ధిక్కారానికి వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ కళా క్షేత్రం వద్ద ఎవరి బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. కళా క్షేత్రం వద్దకు బీఆర్ఎస్ నేతలు రాకూడదనే ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులను ప్రశ్నించారు. వినయ్‌భాస్కర్ హెచ్చరికలతో పోలీసులు కంగుతిన్నారు. వినయ్‌భాస్కర్, ఇతర బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి వెళ్లే వరకు వారి వెన్నంటే పోలీసులు ఉన్నారు.
బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కాళోజీ కళా క్షేత్రం వద్దకు వచ్చే ముందు.. భవనం మూడు గేట్లలో రెండు తెరిచే ఉన్నాయి. బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అక్కడికి వచ్చిన 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకున్నారు. రెండు మెయిన్ గేట్లను మూసివేశారు. బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించాలని కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు వేగంగా అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.
ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక,సాహిత్య ఔన్నత్యాన్ని పెంచే లా ఇక్కడ కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మించారని, కాంగ్రెస్ ప్రభుత్వం చివరలో కొద్దిగా రంగులు వేసి ప్రచారం చేసుకుంటున్నదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఉద్యోగాలు ఇచ్చిన 30 వేల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇస్తూ ఫొటోలు దిగిందని దుయ్యబట్టారు. పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు మరణం తర్వాత ఆయన పేరిట వరంగల్‌లో సాహిత్య కేంద్రం నిర్మించేందుకు సమైక్య ప్రభుత్వాలు ఏ మాత్రమూ ఒప్పుకోలేదని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాళోజీ సాహిత్య కేంద్రం కోసం కనీ సం 300 గజాలైనా జాగ ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, రోశయ్యను అడిగితే పట్టించుకోలేదని గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం కాళోజీ జీవితాం తం తపించారని, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాళోజీ గురించి, ఆయన స్ఫూర్తిని గుర్తించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలోనే దీని నిర్మాణం పూర్తయిందని, చివరలో చిన్నచిన్న పనులు చేసి తామే అంతా చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీ కళా క్షేత్రాన్ని కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం సీఎం ప్రారంభిస్తారని, దీని కోసం వరంగల్ పర్యటన ఉంటుందని ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ మేరకు పనులను చేపట్టారు. వానలతోపాటు కళా క్షేత్రం పనులు పూర్తి కాకపోవడంతో ఈ పర్యటన వాయిదా పడినట్టు తెలిసింది. అక్టోబర్ 2న సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగరానికి వస్తారని, అదే రోజు కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెప్పారు.