హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీ నేతలుగా పేర్కొంటూ ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసేందుకు తిరస్కరించిన గవర్నర్.. రాజకీయ పార్టీకే చెందిన కోదండరాంను నియమించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి హైకోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్ పదవిలోకి వచ్చాక రాజకీయం అనే వాళ్లవి (గవర్నర్ల) కూడా రాజకీయ నియామకాలేనని చెప్పారు. అధికార పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్లను కేంద్ర ప్రభుత్వం గవర్నర్లుగా నియమించబోదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీల నియామక వ్యవహారంలో రాజకీయం అనే గవర్నర్ కూడా గతంలో (గవర్నర్ నియామకానికి ముందు) రాజకీయ పార్టీతో సంబంధాలు నెరిపారని చెప్పారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించాలని గత కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణను కొనసాగించింది. ఈ కేసులో కోదండరాం దాఖలు చేసిన అఫిడవిట్లో తాను ఎందుకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందో హైకోర్టుకు వివరించారని చెప్పారు. అంటే తాను రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తినని ఒప్పుకున్నారని, తమను నిరాకరించిన గవర్నర్ తిరిగి రాజకీయ పార్టీకే చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించారని చెప్పారు. గవర్నర్ చర్య వివక్షా పూరితమైనదిగా ప్రకటించాలని సోంధి కోరారు. మరో పిటిషనర్ కుర్రా సత్యనారాయణ వాదనలు గురువారం కొనసాగనున్నాయి. పిటిషనర్లు దాసోజు, కుర్రా, ప్రతివాదులు గవర్నర్ కార్యాలయం, కోదండరాం, అలీఖాన్ తమ వాదనలు లిఖితపూర్వకంగా గురువారం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.