హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అత్యంత వెనుకబడిన బీసీల హక్కును నిరాకరించి, నమ్మశక్యం కాని రాజ్యాంగ సాకుల వెనుక దాక్కోవడం బీజేపీ ప్రదర్శించే కపటం మాత్రమేనని మండిపడ్డారు.
అప్రజాస్వామికంగా, ఉద్దేశపూర్వకంగా బీసీలకు హక్కులు అందకుండా చేయడం తీవ్రఅన్యాయం అని ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కుదరదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పడం న్యాయంకాదని చెప్పారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మనస్సుంటే మార్గం ఉంటదని.. కేవలం రాజ్యాంగ నిబంధనలను సాకుగా చూపి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం సమంజసంకాదని చెప్పారు.
రాజ్యాంగబద్ధమైన కమిషన్లు కూడా బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతుగా నివేదికలు ఇచ్చాయని గుర్తుచేశారు. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నప్పుడు.. అదే తరహాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే సంకల్పంతో ఎందుకు పోరాడకూడదని ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం చేయడం రాజ్యాంగబద్ధంగా విలువైనది కాదా రాంచందర్‌రావును నిలదీశారు. బీసీల సాధికారత పట్ల బీజేపీకి సంకల్పం, సానుభూతి, నిబద్ధతలేవని తీవ్రస్థాయిలో నిప్పులుచెరిగారు.