Dasoju Sravan | ప్రజాయుద్ధ నౌక గద్దరన్న బిడ్డను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్రలు చేసి, ఆడి పాడి అసువులు బాసిన గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించి.. అవమానించడం నేరమని మండిపడ్డారు.
పార్టీ ఎవరినైనా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుంది, కానీ 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం గద్దరన్న కూతురును పోటీలో నిలబెట్టి, అధికారం చేజిక్కించుకున్నంక ఇప్పుడు వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసం అని దాసోజు శ్రవణ్ అన్నారు. ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు చేరినంక బోడ మల్లయ్య అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారమని మండిపడ్డారు. వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గద్దర్ కృషి చేశారని అన్నారు. కష్టకాలంలో పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువులు బాసిన గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి, అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ కేటాయించారు. కానీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత దుర్మరణం చెందారు. దీంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో శ్రీగణేశ్ బీజేపీ నుంచి పోటీచేస్తారని అందరూ భావించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 40వేల ఓట్లు సాధించి, రెండోస్థానంలో నిలిచిన గణేశ్.. ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. అయితే అనూహ్యంగా ఆయన హస్తం గూటికి చేరారు. దీంతో గద్దరన్న కూతుర్ని కాదని కాంగ్రెస్ పార్టీ.. గణేశ్‌కు టికెట్ కేటాయించింది.