హైదరాబాద్, మే 26 (నమస్తేతెలంగాణ): ‘ఆధారాలు సహా మాజీ మంత్రి హరీశ్‌రావు బయటపెట్టిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నది. సమాధానం చెప్పకుండా సర్కార్ పెద్దలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి తీరు చూస్తుంటే తప్పు జరిగిందని ఒప్పుకొన్నట్టే’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అండతోనే రాష్ట్రంలో యథేచ్ఛగా భూ దోపిడీ జరుగుతుందని ధ్వజమెత్తారు. సీఎం, రెవెన్యూ మంత్రి ఇద్దరూ కలెక్టర్లను కవచకుండలాల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు అనుముల రాజ్యాంగం నడుస్తున్నదని విమర్శించారు. హరీశ్‌రావు బయటపెట్టిన ఆ భూస్కామ్‌పై సమాధానం చెప్పకుండా పొంగులేటి తప్పించుకున్నారని ఆరోపించారు. హైకోర్టు ప్రభుత్వ భూమిగా నిర్ధారించిందని కలెక్టర్ ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాన్ని తుంగలో తొక్కి తహసీల్దార్ ఆర్డర్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తే మంత్రులు, అధికారులు సమాధానం చెప్పకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. వేలకోట్ల విలువైన భూమిని తహసీల్దార్ సంతకంతో అప్పజెప్తారా? అని ప్రశ్నించారు. హైకోర్టు వెకేషన్ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.
తహసీల్దార్, కలెక్టర్ కుమ్మక్కై పెద్దషాపూర్ భూములను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి, కలెక్టర్, తహసీల్దార్‌ను వదిలిపెట్టేదిలేదని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి తాయిలాలకు లోబడి పనిచేస్తే అధికారులు దోషులవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కలెక్టర్‌పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
భయం, భక్తి ఉన్న పాలకుడు ప్రజలకు భయపడుతాడని, కానీ రేవంత్‌రెడ్డికి ప్రజలంటే లెక్కేలేదని దెప్పిపొడిచారు. కేసీఆర్‌పై విషం పెట్టుకొని పాలన నడుపుతున్నారని తూర్పారబట్టారు. గతంలో కేసీఆర్ సలహాదారులపై విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సునీల్ కనుగోలును సలహాదారుగా పెట్టుకోవడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో హైడ్రా పేరిట ఇండ్లు కూలగొట్టడం, ఫ్యూచర్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పితే పరిపాలన సాగడమే లేదని విమర్శించారు.