హైదరాబాద్ మే 12 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉక్కుమనిషి నాయిని నర్సింహారెడ్డి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అభివర్ణించారు. నాయిని జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయినితో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ మహోద్యమంలో నాయిని కీలకభూమిక పోషించారని కొనియాడారు. కార్మికనేతగా కూలీలు, కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. నాయిని సేవలు, త్యాగశీలత తరతరాలకు స్ఫూర్తినిస్తాయని దాసోజు తెలిపారు.