హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ప్రసంగం చూస్తే ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్’ అనే గురజాడ అప్పారావు మాటలు గుర్తొస్తున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ చమత్కరించారు. మోదీ మాయ మాటలు చెప్పి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ఎందుకు అమలుపరచడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరుకు జాతీయ హోదా, బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడిగారు.