హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘మా రాజకీయ భవిష్యత్తును బుగ్గిపాలు చేసినా, మీ రాజకీయ జీవితం మాత్రం బాగుండాలి’ అంటూ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేతలు దాసోజ శ్రవణ్, కుర్రా సత్య సత్యనారాయణ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘అమ్మా.. గౌరవనీయులైన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారూ’.. అని మొదలుపెట్టిన ఆ లేఖలో ‘మీ అపరిపక్వ, తప్పుడు నిర్ణయాలతో బడుగుబలహీన వర్గానికి చెందిన మా రాజకీయ భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు.
మా రాజకీయ జీవితాన్ని ఆగం చేసినా, మీరు మాత్రం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాం. రాజకీయాల్లో మీకున్న విస్తృత అనుభవం లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. హైకోర్టు ఆదేశాల తర్వాతనైనా చేసిన తప్పును సరిదిద్దుకొని శాసనమండలి సభ్యులుగా మమ్మల్ని నియమిస్తారని ఎంతగానో ఎదురుచూశాం. అయినప్పటికీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. అపరిపక్వ, తప్పుడు న్యాయ సలహాపై ఆధారపడి తీసుకున్న వివాదాస్పద రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కారణంగా బడుగులమైన మాకు, మా కుటుంబాలకు తీరని అన్యాయం జరిగింది.
గత ప్రభుత్వంపై ఉన్న శత్రుత్వంతో మాకు రాజకీయ నేపథ్యం ఉన్నదన్న కుంటిసాకును చూపించి మా త్యాగాలు, అర్హతలు, సమాజానికి మేం చేసిన కృషిని విస్మరించి మా రాజకీయ భవిష్యత్తును కాలరాశారు. మేం చాలా అట్టడుగు, అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చామనే విషయాన్ని విస్మరించి, రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తూ, చట్టవిరుద్ధమైన నిర్ణయంతో మా జీవితాలు నాశనం చేశారు. ఈ విషయాలన్నీ ఆత్మశోధన చేసుకోవాలి. మీ తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం అయినప్పటికీ, మీరు మాత్రం రాజకీయ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.