హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ‘ఉప ఎన్నికలు రావు’ అని పేర్కొనడంపై శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థను బెదిరించేలా సీఎం మాట్లాడారని పేర్కొన్నారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యంపై రేవంత్ వ్యాఖ్యలు దాడి చేయడమేనని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన సీఎం.. శాసనసభలో న్యాయమూర్తిలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.