హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): ఆర్ఆర్ ట్యాక్స్‌తో రాష్ట్రం అధోగతి పాలవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుమతులు రావడమే లేదని దుయ్యబట్టారు. ఆ ట్యాక్స్ చెల్లిస్తే అన్నిరకాల అనుమతులు వస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఎప్పుడు అడుగు పెట్టారో కానీ, రాష్ట్రంలో ప్రజలకు పైసలు పుట్టడమే లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థికరంగం కుదేలవడానికి ఆయనే కారణమని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అస్తవ్యస్థంగా మారడానికి ఆయనే సూత్రధారి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో పురోగతి సాధించిన నిర్మాణ రంగం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వచ్చాకే సర్వనాశనమైందని విమర్శించారు. ఈ రంగానికి అనుబంధంగా కొనసాగుతున్న రంగాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని, వ్యాపారాలు లేక, రియల్ రంగం కోలుకోక, భూములు, ఇండ్ల క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించి పోయాయని చెప్పారు.
రెరా, హైడ్రాతో ప్రజలపై పెత్తనం
రెరా తన కుడి భుజంగా, హైడ్రాను ఎడమ భుజంగా మలుచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన ఆగడాలతో యథేచ్ఛగా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. అడ్డూఅదుపు లేకుండా ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రెరా, హైడ్రా సంస్థల ఆగడాల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నిజంగా సీఎం రేవంత్‌రెడ్డిది ఫ్యూడల్ మనస్తత్వమని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం కదేలైన ఈ సమయంలోనే రేవంత్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. అదే జరిగితే రియల్ వ్యాపారులకు ఆత్మహత్యలే తప్ప, మరో అవకాశం ఉండదని, రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ఇకముందు ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.
హైదరాబాద్ ఒక రెవెన్యూ ఇంజిన్
హైదరాబాద్ నగరం రాష్ర్టానికి ఒక రెవెన్యూ ఇంజిన్ లాంటిదని, అలాంటి నగరంలో నిర్మాణరంగం బాగుంటేనే మిగితా రంగాలు బాగుంటాయని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పదేండ్ల కేసీఆర్ హయాంలో నిర్మాణ రంగం ఎందుకు పురోగతి సాధించింది, రేవంత్ పాలనలో ఎందుకు దిగజారిందో ఆలోచించాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ చొరవతో పెట్టబడులకు హైదరాబాద్ నాడు గమ్యస్థానంగా మారిందని చెప్పారు. అదే హైదరాబాద్ ఇమేజ్.. రేవంత్ పాలనలో డ్యామేజీ అయిందని విమర్శించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని, హెచ్ఎండీఏలో కార్యకలాపాలు పడకేశాయని, రెరాను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సైబరాబాద్‌గా మారడానికి 30 ఏండ్లు పట్టిందని, అలాంటి ఫ్యూచర్ సిటీ పూర్తికావడానికి ఎన్నేండ్లు పడుతుందో ఆలోచించాలని చెప్పారు.