హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్ పాకాల తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో విందు చేసుకుంటున్న సమయంలో 300 మంది పోలీసులతో ఇంటిపై దాడిచేసి, ఆ విందును రేవ్ పార్టీగా చిత్రీకరించడం, ఇంటిని ఫార్మ్హౌస్గా చూపించడం, ఆ విందును కేటీఆర్‌కు అంటగట్టడం చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ అవినీతిని మరుగున పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా డ్రగ్స్, రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికితోడు కొంతమంది కేంద్ర మంత్రులు, ఎంపీలు సందట్లో సడేమియా అన్నట్టు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని పనికిరాని ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యులను వీధుల్లోకి లాగి శిఖండి రాజకీయాలు చేయడం తగదని హితవు చెప్పారు.
బెటాలియన్ సస్పెన్షన్లు దుర్మార్గం
రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో అణచివేత పాలన కొనసాగుతున్నదని, పోలీసు సిబ్బందిపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నదని శ్రవణ్ మండిపడ్డారు. శాంతియుతంగా అభిప్రాయాలు వెల్లడించిన 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం భేషరతుగా సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.