హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్‌తో రూపొందించడం ఎందుకో ఎవరికీ అర్థం కాని విషయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాలను వేలాదిగా ఏర్పాటు చేశామని గుర్తుచేశా రు. కానీ నేడు కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించిందని, ఈ నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు అంగీకరించడంలేదని తెలిపారు.
సాగుతోనే జనం గోస తీరింది
తెలంగాణ రాష్ట్రంలో 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, అందులో కాళేళ్వరం ప్రాజెక్టు పాత్ర లేదని కొందరు అంటున్నారని కవిత చెప్పారు. కానీ కోట్ల టన్నుల వరి దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ పాలన వల్లనే సాధ్యమైందని తెలిపారు. వ్యవసాయ రంగంలో 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అయితే ఎంత మందికి ఉపాధి లభించిందో అర్థం చేసుకోవాలని సూచించారు.
సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిందే
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని కవిత విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ చెరువును నింపామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు గొప్పలు చెప్పుతున్నదని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
బోనస్.. అంతా బోగసే
రైతులు పండించే వడ్లకు క్వింటాల్‌కు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.500 బోనస్ ఒక బోగస్‌గా మారిందని కవిత విమర్శించారు. రైతులకు బోనస్ రావడంలేదని తెలిపారు. మహాలక్ష్మి ఒక గేమ్‌చేంజర్ అని ప్రకటన చేశారని, కానీ ఇప్పటివరకు ఆ పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌తో కలిపి ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. వంటగ్యాస్‌కు రూ.500 సబ్సీడీ అందడంలేదని చెప్పారు. ఆరోగ్యశ్రీ బీమాను రూ.10 లక్షలకు పెంచుతామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలలో మందులు, సూది, దూది లేవని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశామని గుర్తుచేశారు.
పెట్టుబడులా… ఎక్కడ?
రాష్ట్రంలో రూ.42 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ సర్కారు చెప్తున్నదని, పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజును కట్టాలని చెప్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు హైడ్రాతో విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ తీర్మానం, ఎస్సీ వర్గీకరణ బిల్లు వివరాలను శాసనమండలిలో ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పథకాల గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ సమావేశాల గడువు పెంచాలి
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోలేదని కవిత విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీ నేతలు మంత్రులుగా ఉండేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు క్యాబినేట్లో మైనార్టీలకు అవకాశం కల్పించకపోవడం బాధాకరమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన మనఊరు, మనబడి కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ సర్కారు నిధులు పెండింగ్ పెట్టిందని కవిత మండిపడ్డారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.దాశరథి శతజయంతి ఉత్సవాల సంగతేంటి?‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నినదించిన గొప్ప కవి, స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి అని, అంతటి ప్రముఖుడి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు ఉత్సవాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని తెలిపారు.