Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదొరోజు మహార్నవమి సందర్భంగా భ్రామరీ అమ్మవారిని సిద్ధిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం అక్క మహాదేవి అలంకారమండపంలో అశ్వవాహనంపై ఆశీనులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రుత్వికులచే శాస్త్రోకపూజలు జరిపించారు. సిద్ధిదాయిని అలంకారంలో చతుర్భుజాలను కలిగి కుడివైపు చక్రము, గద, ఎడమవైపు శంఖము, పద్మాలను ధరించి భక్తులకు అభయమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్రం సందడిగా మారింది. ఆలయ ప్రాకారోత్సవంతోపాటు గ్రామోత్సవంలోఅశ్వవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతో పాటు జానపదాలు, కోలాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, బుట్టబొమ్మలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కర్ణాటక డప్పు కళాకారుల వీరంగ నృత్యాలతోపాటు వివిధ రకాల కళారూపాలతో సందడితో ఉత్సవం కొనసాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంతసేవలు జరిగాయి.
దసరా మహోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్నవీరితోపాటు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ
దంపతులకు పూర్ణకుంభ స్వాగతంతో ఈవో పెద్దిరాజు ఆహ్వానం పలకగా, మంగళవాయిద్యాలు వేదమంత్రోచ్చారణలతో పట్టు వస్త్రాలను తలపై ఉంచుకుని ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, పూలు సమర్పించిన తరువాత మంత్రి మాట్లాడుతూ లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ పూర్వం నుండి రాజ కుటుంబికులుచక్రవర్తుల సాంప్రదాయంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించే ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం : కేసీఆర్
SC Reservations | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు..
Telangana | సమగ్ర కులగణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు