Daruvu Yellanna | హైదరాబాద్ : ఒక ఉద్యమకారుడికి న్యాయం చేయలేనోళ్లు.. రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..? అని కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్న నిలదీశారు. ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడిద్దామని దరువు ఎల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో దరవు ఎల్లన్న గులాబీ గూటికి చేరారు. ఎల్లన్నకు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దరువు ఎల్లన్న మాట్లాడుతూ.. ఈ తెలంగాణ సమాజానికి, ప్రజానీకానికి కాషాయ, కాంగ్రెస్ మరకలు ఉండొద్దని తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఆహ్వానించిటువంటి పద్ధతి జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను(కేటీఆర్‌ను ఉద్దేశించి). రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మనం చూస్తున్నాం. తెలంగాణ కోసం నాలాగే ఎంతో మంది బిడ్డలు కష్టపడ్డారు. వందలాది కేసులు మోసి జైళ్లకు వెళ్లారు. అలాంటి వారు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నారు. ఒక్క విద్యార్థి నాయకుడికైనా టికెట్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. ఎన్నికల టైం వచ్చే వరకు ముసలోళ్లకు, ముడిగోళ్లకు, పనిరానోళ్లకు, పైసలు ఇచ్చేటోళ్లకు టికెట్లు అమ్ముకున్నారు. ఈ ప్రక్రియను చూస్తుంటే నా గుండెలో రాయి పడ్డట్టు అయింది. తెలంగాణ కోసం కొట్లాడింది ఆ స్వార్థపరుల కోసమా? అనిపించిందని దరువు ఎల్లన్న పేర్కొన్నారు.
విద్యార్థి ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించాలని మా మిత్రులు ఇటీవల ఏఐసీసీ ఆఫీసు వద్ద ధర్నా చేశారని ఎల్లన్న గుర్తు చేశారు. తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది. విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. బీజేపీ కూడా ఏం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న వారేం చేయలేదు. పవర్లో ఉండి కేసీఆర్, కేటీఆర్ ఎంతో మంది విద్యార్థి నాయకులకు అవకాశాలు కల్పించి ఉన్నతస్థానాలకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. ఉద్యమ సమయంలో బాల్క సుమన్ జేబిలో ఒక్క రూపాయి కూడా లేదు. విద్యార్థి ఉద్యమ నాయకుడి అని సుమన్‌ను గెలిపించారు. పైసలు ఉంటేనే టికెట్లు ఇద్దామనుకుంటే సుమన్ ఎంపీ, కిశోర్ ఎమ్మెల్యే, బొంతు రామ్మోహన్ మేయర్ అయ్యేవారేనా..? అని ప్రశ్నించారు. అంటే మనసుండాలి చేయడానికి అని ఎల్లన్న పేర్కొన్నారు.
మేం మాత్రమే పదవులు అనుభవిస్తాం.. మీరంతా ఏండ్ల తరబడి పని చేయాలనేది కాంగ్రెస్, బీజేపీ పార్టీల విధానం అని దరువు ఎల్లన్న అన్నారు. ఎన్నికలు రాగానే పక్కన పెడుతాం.. డబ్బుల సంచులు తెచ్చినోళ్లకు టికెట్లు ఇస్తాం అంటున్నారు. రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశాను. అవకాశం వచ్చే సమయంలో పక్కన పడేస్తారు. బీజేపీ అడ్డగోలు చాకిరి చేయించుకుంది. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ.. దరువు ఎల్లన్న నువ్వు ఎలా బీజేపీలోకి పోతావు అని చాలా మంది అడిగారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో.. అణగారిన వర్గాల కోసం పోయాను. నాలాంటి ఎంతో మంది నష్టపోయారు. ఇవాళ ఆ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి. ఎల్లన్న పనికిరాడు. కోట్ల రూపాయాలు లేవు కదా..? అని తనను పక్కన పెట్టారని ఎల్లన్న పేర్కొన్నారు.
పేదలను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీనే అని ఎల్లన్న స్పష్టం చేశారు. చాలా సార్లు బీఆర్ఎస్ను విమర్శించాను. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని విమర్శించాను. ఇదే ట్యాంక్ బండ్ వద్ద అమరుల ద్వీపం వెలుగుతుంటే నా మనసులో తన ఆశ, కల నెరవేరిందనుకున్నాను. దళితబంధు ఇస్తున్న బీఆర్ఎస్కు దళిత సమాజం రుణపడి ఉంటుంది. దండేసి దండం పెట్టుడు కాదు అన్నా.. అంబరాన్నంటేలా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. నా ఆశలు, ఆకాంక్షలు ఇవే. ఉద్యమకారులకు న్యాయం జరగాలన్నదే ఆకాంక్ష. అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన ప్రాంతం టూరిజం స్పాట్‌గా మారింది. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పనులు అవుతాయి. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంటే.. కాళ్ల వరకు లేదా.. ముఖం వరకు విగ్రహాలను ఏర్పాటు చేసి వదిలేసేవారని ఎల్లన్న తెలిపారు.
నీళ్లు సాధించుకున్నాం.. నిధుల విషయంలో కూడా సంపూర్ణత సాధించాం అని ఎల్లన్న పేర్కొన్నారు. ఏ పథకమైన సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. మొదటి దశలో నీళ్లు, రెండో దశలో నిధులు సమకూర్చుకున్నారు. మా విద్యార్థి లోకాన్ని దృష్టిలో ఉంచుకొని, నియామకాల కోసం దృష్టి సారించాలని కోరుతున్నాను. ఉద్యమం చేసినవాడిని ఉద్యమకారులతో ఉండాలి.. ఉద్దెరగాళ్లతో కాదు అని బీజేపీకి రాజీనామా చేశాను. ఉద్యమ జెండాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం వచ్చిందన్నారు దరువు ఎల్లన్న.