కరీంనగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారులు, బుధవారం దర్శనాల మూసివేతకు సంబంధించి ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. రెండు గంటలపాటు హైడ్రామా చోటుచేసుకున్నది. భక్తులు ఒక్కసారిగా భగ్గుమనడంతో రెండు గంటల తర్వాత అధికారయంత్రాగం దిగొచ్చి మళ్లీ అవకాశం కల్పించినా.. ఇంకా అదే అస్పష్టతను కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
కార్తీక మాసం ప్రారంభం కావడంతో రాజన్న ఆలయానికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం స్వామివారి గర్భాలయంలోని అభిషేక పూజలకు అనుమతించిన ఆలయ అధికారులు అందుకు సంబంధించిన టికెట్లను సైతం జారీచేశారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, స్వామివారికి తలనీలాలు లాంటి మొక్కులను చెల్లించుకొని ఆలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది ఒక్కసారిగా చేదు వార్త వినిపించారు. ఉదయం 10 గంటలకల్లా ఆలయాన్ని మూసివేస్తున్నామని, వెంటనే అందరూ బయటికి వెళ్లిపోవాలని సూచించారు.
ఎక్కడికక్కడ ఆలయ పరిసరాల్లోకి చేరుకునే దారులను మూసివేస్తూ భద్రతా సిబ్బందితో హెచ్చరించారు. ఉదయం పదిన్నర గంటలకల్లా.. భక్తులను బయటకు పంపిన అధికారులు.. లోనికి రాకుండా భద్రత సిబ్బందిని ఏర్పాటుచేశారు. దీంతో నిర్ఘాంతపోయిన భక్తులు, అధికారుల ఆకస్మిక నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటిదాకా దర్శనాలకు అనుమతించి అప్పటికప్పుడే రద్దు నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరద్వారం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని, ఆలయ అధికారులను భద్రతా సిబ్బందిని నిలదీశారు.
అసలు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కూడా ప్రచార సాధనాల ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత లేదా? అని మండిపడ్డారు. పుట్టువెంట్రుకలు తీసుకొని దర్శనానికి వచ్చేసరికి ఎలా మూసివేస్తారని నిజామాబాద్‌కు చెందిన ఓ వృద్ధురాలు నిలదీసింది. భక్తుల ఆగ్రహం పెల్లుబికడం, భారీగా విమర్శలు రావడంతో చివరకు స్వామివారి నివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి తూర్పుద్వారం నుంచే భక్తులకు లోనికి శీఘ్ర దర్శనానికి అనుమతించారు. లోపలికి అనుమతి ఇవ్వని సమయంలో రాజన్న ఆలయం ముందున్న ప్రచారరథం వద్ద భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయ అర్చకులు చేరుకొని భక్తులకు అక్కడే తీర్థప్రసాదాలు అందజేశారు.
ఉదయం నుంచే నీటి సరఫరా, పవర్ కట్
రాజన్న ఆలయంలో స్వామివారితోపాటు అనుబంధ ఆలయాలు ఉండగా, చతుష్కాల పూజల్లో భాగంగా చేయాల్సిన పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, రాజన్న అనుబంధ ఆలయాల్లోనూ పూజలు నిర్వహిస్తుండగా, ఉదయం నీటి సరఫరాను బంద్ చేయడంతో బయటినుంచి నీటిని తీసుకొచ్చి పూజలు చేశామని అర్చకులు తెలిపారు. ఆలయాన్ని ఉదయం 10 గంటల తర్వాత బంద్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ఆలయంలోని అంతర్ ఆలయాలకు కూడా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు కూడా రాజన్న ఆలయంలో నిలుపుదల చేసి, భీమేశ్వరాలయంలోనే చేసుకోవాలని భక్తులకు సూచించారు. ఆ మేరకు కోడెమొక్కులు భీమేశ్వర ఆలయంలోనే జరిగాయి.
రేకులషెడ్డు పనుల కోసమే దర్శనాల నిలిపివేత: ఈవో
రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు అధికారికంగా దర్శనాలు నిలిపివేస్తున్నామని ఎక్కడ ప్రకటించలేదని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారి ఆలయంలోని రేకులషెడ్డు తొలగించే క్రమంలో భక్తుల మీద పడే ప్రమాదం ఉంటుందని, అప్రమత్తతలో భాగంగా గంటన్నరపాటు మాత్రమే దర్శనాలు నిలిపివేశామని వివరణ ఇచ్చారు. ఈవో చెప్తున్న దానికి, అక్కడ భద్రతా సిబ్బంది చెప్పిన దానికి ఏమాత్రం పొంతన లేకుండా పోయింది.
రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శనాలు భీమేశ్వర ఆలయంలో కల్పించామని, ఇక్కడ బంద్ చేశామని భద్రతా సిబ్బంది చెప్పారు. తాము రాజన్నను మాత్రమే దర్శించుకునేందుకు వచ్చామని, మీరు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు బంద్ చేశారని పలువురు భక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత యథాప్రకారం దర్శనాలు కొనసాగించడంతో అధికారుల తీరు గందరగోళానికి దారితీసింది. మరోవైపు, రాజన్న ఆలయంలో దర్శనాల విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం ప్రణాళికాలోపానికి నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి.