హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూలైన్లలో భక్తులు ఎకువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు ఏర్పాట్లుచేస్తామని చెప్పారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎలాం టి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. శ్రీనివాస సేతును గరుడవారధిగా పేరు మార్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు పేరు మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో.. వాటిని పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలపై కమిటీ నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, దీని ప్రకారం సంస్థ పనులు చేపట్టనున్నట్టు చైర్మన్ వెల్లడించారు.