యాచారం, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మూలవిరాట్ దర్శన భాగ్యం భక్తులకు కల్పించనున్నట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నజ్దిక్‌సింగారం గ్రామంలో పునర్నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణ శిలలతో అత్యంత సుందరంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని రూ.1,200 కోట్లతో పునర్నిర్మించినట్టు తెలిపారు. ఇది రాజుల కాలంలోనూ సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి నిర్మాణంతో సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాతే దేవాలయాల ప్రతిష్ఠ పెరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణ కీర్తి పెరిగేలా మేడారంలో సమ్మ క్క-సారక్క జాతర ఉత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. సుమారు 1.30 కోట్ల మంది భక్తులు మేడారం మహా జాతరకు విచ్చేశారని చెప్పారు. దేవాలయ భూములను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. దేవాదాయశాఖ గుర్తింపు పొంది, అభివృద్ధికి నోచుకోని పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.