హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురపాలికలు అంధకారంలో మగ్గుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు అనేక మున్సిపాలిటీల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. వీధిలైట్ల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, ఈఈఎస్ఎల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగిసిపోవడంతో నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఏడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. గత ఏప్రిల్‌తో జీహెచ్ఎంసీతోపాటు 70 పురపాలికల్లో ఈ ఒప్పందం ముగిసింది. మరో 69 పురపాలికల్లో ఈఈఎస్ఎల్ వీధిలైట్ల నిర్వహణ బాధ్యతలను చూస్తున్నది.
సర్కారు నుంచి రూ.300 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండటంతో లైట్ల నిర్వహణను ఆ సంస్థ అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈఈఎస్ఎల్తో ఒప్పందం ముగిసిన మున్సిపాలిటీల్లో కొత్త ఏజెన్సీని రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. ఒప్పందం పొడిగించాలని ఈఈఎస్ఎల్ చేసిన ప్రతిపాదనపై కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆర్థిక పరిమితులు, ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లేకపోవడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ పరిధిలోని ఎల్ఈడీ స్ట్రీట్లైట్ల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నాయి.
జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎల్ఈడీ స్ట్రీట్లైట్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 141 యూఎల్బీల్లో సుమారు 17 లక్షల ఎల్ఈడీ స్ట్రీట్లైట్లను ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా సుమారు 193 మెగావాట్ల విద్యుత్తు ఆదా అవుతున్నది. 0.81 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. జీహెచ్ఎంసీ ఒకటే విద్యుత్తు బిల్లులపై సంవత్సరానికి దాదాపు రూ.80 కోట్లు ఆదా చేసింది. ఈఈఎస్ఎల్తో కుదుర్చుకున్న ఏడేండ్ల ఒప్పందం ప్రకారం.. స్థాపించిన స్ట్రీట్‌లైట్లకు ఉచిత నిర్వహణతోపాటు హామీ ఇచ్చిన విద్యుత్తు ఆదా కూడా ఉన్నది.
జీహెచ్ఎంసీతో ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. అప్పటినుంచి కార్పొరేషన్ తన పరిధిలోని 5.5 లక్షల ఎల్ఈడీ స్ట్రీట్లైట్ల నిర్వహణ కోసం ఇతర ఏజెన్సీలను నియమించాలని నిర్ణయించింది. ఇతర పురపాలికల్లో కూడా ఈఈఎస్ఎల్ ఒప్పందాలు ఏప్రిల్‌లోనే ముగిశాయి. అప్పటినుంచి, సంబంధిత పురపాలికల్లోని ప్రత్యేక అధికారులే తాతాలిక ఏర్పాట్లతో నిర్వహణను కొనసాగిస్తున్నారు. కానీ, పరిమిత నిధులు, మానవ వనరుల లేమి, ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లేకపోవడంతో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ ఆందోళనకరంగా మారింది. అనేక ప్రాంతాల్లో వీధిలైట్లు సక్రమంగా వెలుగడం లేదు. అర్థరాత్రి 12 గంటల తర్వాత అనేక ప్రాంతాల్లో లైట్లు వెలుగక అంధకారం అలముకుంటున్నది.
ఈఈఎస్ఎల్తో జీహెచ్ఎంసీ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో కొత్త ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు, తిరిగి ఐదేండ్లపాటు పోల్స్‌తో సహా రూ.897 కోట్ల టెండర్ పిలిచేందుకు గత వారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నెలలో జోన్‌కు రూ.4 కోట్ల చొప్పున రూ.24 కోట్లు కేటాయించినా, అమలు లోపాలతో ఎలాంటి మార్పు లేదు. కార్వాన్, షేక్‌పేట్ తదితర ప్రాంతాల్లో మూడు నెలలుగా లైట్లు పనిచేయకపోవడంతో నివాసితులు ఫిర్యాదులు చేస్తున్నా, స్పందన లేదు. కొత్త ఏజెన్సీని నియమించే వరకు ప్రజలు అంధకారంలోనే మగ్గే పరిస్థితి తయారైంది.
ఇండివిజ్యువల్ లూమినర్ కంట్రోల్ (ఐఎల్సీ) లేదా ఇంటిగ్రేటెడ్ మినార్ మానిటరింగ్ (ఐఎంఎం) సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐఎల్సీ ద్వారా ఒకో స్ట్రీట్లైట్ని నేరుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒకేచోట నుంచి ఎకడ స్ట్రీట్‌లైట్ వెలగకపోయినా తెలుసుకోవచ్చు. ఆదే ఐఎంఎంతో అయితే ఒక ఏరియా లేదా కొన్ని లైట్లను కలిపి మెయింటెయిన్ చేయవచ్చు. ఈ రెండింట్లో ఏదో ఒక సిస్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కొత్తగా వచ్చే ఏజెన్సీలకు ఐదేండ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పొడిగిస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోనే సమస్య తీవ్రంగా ఉన్నది. 5 లక్షలకుపైగా వీధి దీపాల్లో దాదాపు 35 శాతానికి మించి వెలగడం లేదు. ఇది 50,000 నుంచి 60,000 మధ్య మాల్ ఫంక్షనింగ్ లైట్లుగా అంచనా వేస్తున్నారు. ఈఈఎస్ఎల్తో ఒప్పందం ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ స్వయంగా నిర్వహణ చేపట్టినా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పెరిగాయి. ఈ ఏడాది ఒక్క మే నెలలోనే టోల్‌ఫ్రీ నంబర్‌కు 9,000కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 5,800 మాత్రమే పరిష్కరించారు. ఇది కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్రంలోని మిగిలిన పురపాలక సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు విమర్శలు గుప్పిస్తున్నా పురపాలక సంస్థలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.