హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కొవిడ్ సమయంలో వైద్యుల సేవలు మరువలేనివని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ వైద్యులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.
బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేశామని, కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇస్తూ.. డాక్టర్లకు నచ్చిన పోస్టింగ్ ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించినట్టు చెప్పారు. కానీ ప్రతి ఒక్కరూ హైదరాబాద్లోనే పోస్టింగ్ కావాలంటే ఎలా ఇవ్వగలమని అసహనం వ్యక్తంచేశారు. వైద్యుల డిమాండ్లు అన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అందే సేవల్లో ఎలాంటి ఆటంకాలు సృష్టించొద్దని వైద్యులను ఆయన కోరారు.