హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నిమ్స్ లో ఉన్న 35 మందిలో ఐదుగురిని శుక్రవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్ డైరెక్టర్ బీర ప్ప వెల్లడించారు. గాంధీలో ఉన్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని, మిగిలిన 14 మంది కండీషన్ నిలకడగా ఉన్నదని డాక్టర్లు మంత్రికి వివరించారు.
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కల్తీ కల్లు ఘటనలో పలువురు మృతిచెందడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి కూనంనేని విలేకరులతో మాట్లాడారు. అధిక లాభాల కోసం కొంత మంది కృత్రిమంగా కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కల్లు పేరుతో కృత్రిమ పానీయాల తయారీని నిరోధించాలని కూనంనేని కోరారు.
ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని నెల్లికంటి డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత డీజీ నర్సింహారావు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహరావు మాట్లాడుతూ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.