
పథకాల తెలంగాణలో మరో విప్లవాత్మక పథకానికి తెర లేవనున్నది.. సంస్కరణల తెలంగాణలో మరో సరికొత్త సంస్కరణ రానున్నది.. మాటలకు బదులు చేతలు కనిపించే తెలంగాణలో చేవ పూనిన మరొక కార్యక్రమం మొదలు కానున్నది. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి స్కీములు అమలు చేసే తెలంగాణలో సంక్షేమం పట్టిన మరో స్కీము దళిత బంధు రూపంలో త్వరలో ప్రారంభం కానున్నది. అదెలా ఉండాలి? ఎలా అమలు చేయాలి? ఎలా లక్ష్యాన్ని సాధించాలి? అనే అంశాలపై నేరుగా దళితులతోనే సీఎం కేసీఆర్ చర్చించే అపురూప సందర్భానికి ప్రగతిభవన్ నేడు వేదిక కానున్నది.
కన్నతండ్రి లెక్క పిలిచిండు
కేసీఆర్ సార్ మీటింగ్ పోవాల్నని అంటే సంతోషమైంది. సార్‌ను దగ్గరి నుంచి చూసి, సార్ చెప్పే మాటలు వినాలని అనుకున్న. నాకు ఇద్దరు చిన్నపిల్లలున్నరు. ఎట్లయినా మీటింగ్‌కు పోవాల్నని పిల్లలను పట్టుకునేందుకు మా అవ్వను రమ్మన్న. ఊరికి దూరంగా ఉండే మా జీవితాలకు ఓ దారి చూపి స్తా బిడ్డా అని కన్నతండ్రి లెక్క పిలిచిండు. పండుగకు పుట్టింటికి పోతున్నంత సంబురంగా ఉన్నది. –అజిత , హుజూరాబాద్ నియోజకవర్గం
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఒక అభివృద్ధి పథకాన్ని తీసుకొస్తే ప్రజలకు అందే లబ్ధిపై ప్రభుత్వానికి అవగాహన మాత్రమే ఉంటుంది. అదే, అర్హత ఉన్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, ఎలా చేద్దాం? అని చర్చిస్తే వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పుడదే చేస్తున్నారు. దళితబంధు పథకంపై దళితులతోనే నేరుగా మాట్లాడనున్నారు. ప్రగతిభవన్‌కు రావాలని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న హుజూరాబాద్ నియోజకవర్గ వాసులకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, సాధించే లక్ష్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు జరుగనున్నది. రోజంతా జరుగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోని ఒకో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) 412 మంది పురుషులు, మహిళలు, 15 మంది రిసోర్స్ పర్సన్స్.. మొత్తం 427 మంది దళితులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నియోజకవర్గం నుంచి ఎంపికైనవారు ఉదయం 6 గంటలకే బయలుదేరేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సమావేశం జరుగనున్నది. సమావేశంలో.. దళితబంధు పథక ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతోపాటు పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది? పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్‌లో చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె? దళితుల సామాజిక, ఆర్థికగౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న దళితబంధు పథక ఉద్దేశాలేంటి? ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె? వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.
మా బతుకుదెరువు.. కేసీఆర్
మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేదు. ముఖ్యమం త్రి కేసీఆర్ మమ్మల్ని తన ఇంటికి పిలుచుకొని మాతో మాట్లాడతారట అంటే ‘అవన్నీ ఉత్తవే’ అనుకున్నం. కానీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రానే వచ్చింది. ఎట్లా చెప్పాలో తెల్వటం లేదు. కలలో కూడా అనుకోలేదు. మా స్థాయి ఏంది? సీఎం ఏంది? మమ్ములను పిలుసుడు ఏంది? అనుకున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నంత పనిచేస్తడు. మా జీవితాలు ఇగ బాగు పడుడే. మాకు అండగా ఉంటానని సీఎం చెప్పిండు. మా బతుకు దెరువు ఇక కేసీఆర్. –మొండెద్దుల రాజమౌళి
దేవుళ్ల బొమ్మ పక్కన కేసీఆర్ పటం పెట్టుకుంటం
మేం బేడబుడగ జంగాలోల్లం. ఎక్కడ పనుంటే అక్కడ పనిచేస్తం. లేకుంటే పస్తులుంటం. అసుంటిది ముఖ్యమంత్రి మమ్ములను సుట్టాల్లెక్క పిలిచిండు. దేవుడే పిలిచిండని అనుకుంటం. కేసీఆర్ మాటిస్తే నిలబెట్టుకుంటడు. మా పాలిట దేవుడిలెక్క కొత్తపథకం తెస్తున్నడు. ఇంట్లో దేవుళ్ల బొమ్మల పక్క కేసీఆర్ పటాన్ని పెట్టుకొని పూజిస్తం. –తూర్పాటి క్రాంతికుమార్, బేడ బుడగజంగాల ప్రతినిధి
మస్తు సంతోషంగా ఉన్నది
మాకోసం దళితబంధు పథకాన్ని తెస్తూ, మా సాదకబాధకాలు వినేందుకు మమ్మల్ని సీఎం కేసీఆర్ పిల్వటం సంతోషంగా ఉన్నది. పండుగలెక్క అనిపిస్తాంది. టీవీలల్ల ప్రగతిభవన్‌లో కేసీఆర్ మీటింగ్‌లు చూసేది. అసుంటిది మేము కూడా మీటింగ్‌కు వెళ్లటం అంటే మస్తు సంతోషంగా ఉన్నది. – పుల్లా రాజేశ్వరి