SC Sub Categorisation | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రజాపాలనలో దళితసంఘాల వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై దళితసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమేగాకుండా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. 2011 ఎస్సీ జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలుచేయాలని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు తగిన సిఫారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని, అదేవిధంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ పలు దఫాలుగా సమావేశమై రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రజాసంఘాల అభిప్రాయం తీసుకున్నది.
ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ దళితసంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే ఒక్క ఆన్లైన్ ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 2వేలకు పైగా, ఆఫ్‌లైన్ ద్వారా దాదాపు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ సైతం జిల్లాల వారీగా బహిరంగ విచారణలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళితసంఘాలు పెద్దఎత్తున పాల్గొని డిమాండ్లను ముందుపెట్టాయి. 8వేలకు పైగా విజ్ఞప్తులు వచ్చినట్లు అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా వచ్చిన విజ్ఞప్తుల్లో చాలా వరకు ఎస్సీల వర్గీకరణ శాస్త్రీయంగా చేపట్టాలని కోరినట్టు తెలుస్తున్నది. 90 శాతానికి పైగా దళితసంఘాలన్నీ 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ప్రస్తుత జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కల ఆధారంగానే ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల, ఎస్సీ ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే క్యాబినెట్ సబ్‌కమిటీ, ఏకసభ్య కమిషన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించాయని దళితసంఘాలు మండిపడుతున్నాయి.
2011లో ఉమ్మడి రాష్ట్రంలో సేకరించిన జనాభా లెక్కలను ఆధారం చేసుకొని కమిషన్ రిజర్వేషన్లను వర్గీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో 52,17,684 మంది ఎస్సీ జనాభా ఉన్నట్టు నిర్ధారించింది. రాష్ట్రంలోని 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు అమలుచేస్తున్న 15 శాతం రిజర్వేషన్లను కూడా ఏ గ్రూపులోని 15 ఎస్సీ కులాలకు 1 శాతం, బీ గ్రూపులో 18 ఎస్సీ కులాలకు 9 శాతం, సీ గ్రూపులో 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని సిఫారసు చేసింది. ఈ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాజా గణాంకాలను పరిగణలోకి తీసుకుని వర్గీకరణ అమలుచేయాల్సి ఉన్నదని, అందుకు విరుద్ధంగా 2011 నాటి లెక్కలను పరిగణలోకి తీసుకోవడమేంటని దళితసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అనేక ఎస్సీ కులాలు ప్రస్తుతం తెలంగాణలో లేవని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం నిర్వహించిన ఇంటింటి సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,84,319(17.43 శాతం) పెరిగారని గుర్తుచేస్తున్నాయి.
దాదాపు 9.60 లక్షల జనాభా పెరిగిందని వెల్లడిస్తున్నాయి. రూ.160 కోట్లు ఖర్చుపెట్టి శాస్త్రీయపద్ధతిలో ఇంటింటి సర్వే నిర్వహించి కులగణన నిర్వహించామని చెబుతున్న ప్రభుత్వం ఆ లెక్కలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. విద్యా, ఉపాధి, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయకుండా రిజర్వేషన్ల వర్గీకరణ అమలుచేయడంతో నష్టమే తప్ప మెజార్టీ ఎస్సీ కులాలకు ఒనగూరేది ఏమీ ఉండబోదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 2014 ఎస్కేఎస్ సర్వే ప్రకారమైతే 64 లక్షలకు పైగా ఎస్సీ జనాభా ఉందని, ఇప్పుడు జనాభానే తగ్గించారని దుమ్మెత్తిపోస్తున్నాయి.