Telangana Budget | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): దళితుల సర్వతోముఖాభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించి అమలుచేసిన దళితబంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ స్వస్తి పలికింది. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని సైతం తుంగలో తొక్కింది. అటు దళితబంధు పథకానికి, ఇటు అంబేద్కర్ అభయహస్తం పథకానికి తాజా బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు సైతం నిధుల కేటాయింపు బడ్జెట్ పద్దులో కానరాలేదు.
సొంత వ్యాపారాలు, తెలిసిన, నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకొని జీవించడానికి నిరుపేద దళిత కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు లింకేజీ లేకుండా ఏకమొత్తంగా రూ.10లక్షల నగదును అందించే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పేరిట దళితబంధు పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 44 వేల దళిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అందుకు రూ.4400 కోట్ల నిధులను వెచ్చించారు. ఆ పథకానికి 2023-24 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. హుజురాబాద్ మినహాయించి నియోజకవర్గానికి 1500 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొత్తంగా 17,700 కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించారు.
అందుకు 17,700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక విడత ఆర్థిక సాయాన్ని కూడా అందజేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఆ పథకానికి నిధులేవీ కేటాయించకపోవడం గమనార్హం. దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్‌కు బడ్జెట్ పద్దులో రూ.2వేల కోట్లను కేటాయించినట్లు చూపినా అవి దళితబంధు పథకానికి కాదని ఎస్సీ సంక్షేమ ఉన్నతాధికారులు వెల్లడించడం గమనార్హం.
అధికారంలోకి వస్తే దళితబంధు తరహాలో అంబేద్కర్ అభయహస్తం పేరిట ఒక్కో దళిత కుటుంబానికి రూ.12లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబోయే ఐదేండ్లలో నిధులను కేటాయించి ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపింది. చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్లో ఆ పథకం ఊసే లేకుండాపోయింది. దీంతో ఉన్న దళితబంధుతో పాటు, అంబేద్కర్ అభయహస్తం పథకం కూడా ఉత్త ముచ్చటగానే మారింది.