Dalit Bandhu | ఖమ్మం/కామారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పథకం అమలుకు సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారి పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం ఒకటి. మండలానికి చెందిన లబ్ధిదారులు ఖమ్మం నగరంతోపాటు ఇతర పట్టణాల్లోనూ యూనిట్లు నెలకొల్పారు. ప్రతి పంచాయతీకి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి యూనిట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర చోట్ల ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలకే లబ్ధిదారులు పరిమితం కాగా చింతకాని మండలానికి చెందిన లబ్ధిదారులు భిన్నమైన యూనిట్లు నెలకొల్పారు. ఇలా ప్రస్తుతం 65 రకాల యూనిట్లు నడుస్తున్నాయి. కొందరు ఒకే కుటుంబం కలిసి యూనిట్లు నెలకొల్పగా, కొన్నిచోట్ల రెండు మూడు కుటుంబాలు కలిసి యూనిట్లు నడుపుతున్నాయి.
కొందరు స్థానికంగా యూనిట్లు నడిపిస్తుండగా మరికొందరు తమకు నచ్చిన పట్టణాలు, గ్రామాల్లో యూనిట్లు నడిపిస్తున్నారు. నిన్నమొన్నటివరకు వ్యవసాయ కూలీలు, దుకాణాల్లో సహాయకులు, ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు దళితబంధు యూనిట్లతో స్వయంగా ఉపాధి పొందుతున్నారు. మండలంలో మొత్తం 26 పంచాయతీలు ఉండగా 3,462 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు యూనిట్లు అందాయి. అలాగే, కామారెడ్డి జిల్లా జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో 1,298 దళిత కుటుంబాలు దళితబంధుతో లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.129.80 కోట్లు అందజేసింది. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను పంపిణీ చేసింది. వీటితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని 300 మందికి దళితబంధు పథకం ద్వారా రూ. 30 కోట్లను అందజేసింది. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,598 మందికి రూ.159.80 కోట్లను అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,100 యూనిట్ల చొప్పున జిల్లాకు 4400 యూనిట్లు (రూ.440 కోట్లు) మంజూరు చేసింది.
నేను దివ్యాంగుడిని. గతంలో ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడిని. దళితబంధు పథకంలో నాకు రూ.10లక్షల విలువ చేసే పెయింటిగ్ యూనిట్ మంజూరైంది. దీంతో కూలి పనికి వెళ్లే నేను యజమానిని అయ్యాను. షాపు ద్వారా ఇప్పుడు రోజుకు కనీసం రూ.1000 ఆదాయం వస్తున్నది. షాపుపై వచ్చిన ఆదాయంతో ఎకరా భూమి కొన్నాను. నాకు బీమా చేయించుకున్నాను. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నా.
– మొండితోక నాగరాజు, పెయింటింగ్ దుకాణ యజమాని, నాగులవంచ, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
నేను గతంలో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. పని దొరకనప్పుడు ఇంట్లోని పాత కుట్టుమిషన్‌తో దుస్తులు కుట్టి అంతోఇంతో సంపాదించే వాడిని. దళితబంధులో భాగంగా నాకు రూ.30 లక్షల విలువైన జేసీబీ యూనిట్ అందింది. మేం ముగ్గురు అన్నదమ్ములం కలిసి జేసీపీని నడిపిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. ముగ్గురం కలిసి రోజుకు సుమారు రూ.3 వేల చొప్పున సంపాదిస్తున్నాం.
– కొల్లి బాబు, జేసీబీ యజమాని, నాగులవంచ, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
మాది నిజాంసాగర్. దుకాణాల్లో హమాలీగా పనిచేసేవాడిని. పని దొరికినప్పుడు తినుడు లేకుంటే పస్తులుండడం. హమాలీ పనికోసం నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి ఇట్ల మస్తు తిరుగుతుంటి. దళితబంధు పథకం నా కష్టాలను దూరం చేసింది. నాకు దళితబంధు మంజూరైనట్లు తెలిసి ఎంతో సంతోషపడ్డాను. అయితే నాకు ఏ పనీ రాకపోవడంతో ఏం చేయాల్నో అర్థం కాలేదు. కలెక్టర్ సారు స్పందించి నువ్వు డ్రైవింగ్ నేర్చుకో లగేజీ వాహనం కొనుక్కో అని చెప్పిండ్రు. నెల రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నా. కలెక్టర్ సారు సహకారంతోనే డ్రైవింగ్ లైసెన్సు వచ్చింది. ఆ తర్వాత టాటా ఏస్ వాహనాన్ని కొనుకున్న. ఈ వాహనంతో జీవనోపాధి పొందుతున్న. ప్రతి నెలా 30 నుంచి 40 వేలు సంపాదిస్తున్నా. ఒకప్పుడు హమాలీగా ఉన్న నేను ఇప్పుడు ఓనర్‌గా మారిన.
– కె.వెంకట్, నిజాంసాగర్
నేను, నా భార్య గతంలో కూలి పనులకు వెళ్లేవాళ్లం. అంతంతమాత్రమైన కూలితో బతుకుబండిని లాగించేవాళ్లం. దళితబంధు పథకంలో మాకు అత్యాధునిక టైలరింగ్ మెషీన్లు, పరికరాలతో కూడిన షాపు, బ్రాండ్ దుస్తుల స్టాక్ యూనిట్ మంజూరైంది. నాడు కూలీలమైన మేము ఇప్పుడు షాపునకు యాజమానులమయ్యాం. షాపు ద్వారా ఇప్పుడు మాతోపాటు మరికొందరికి ఉపాధి లభిస్తున్నది. అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.1000కి తక్కువ కాకుండా సంపాదిస్తున్నాం. దళితబంధు పథకం మా కుటుంబంలో వెలుగులు నింపింది.
– కొల్లి పావనం, ప్రొద్దుటూరు, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
మాది నిజాంసాగర్ మండలం బండపల్లి. నాకు మూడెకరాల పొలం ఉన్నది. ఆ పొలంల దున్నాలంటే కిరాయికి ట్రాక్టర్‌ను తీసుకొచ్చేవాడిని. కూలీలు, ట్రాక్టర్ కిరాయితోని ఎవుసం చేసుడు మస్తు కష్టంగా ఉండేది. లాభం అస్తుందో లేదో అనే భయంతో ఎవుసం చేసేటోన్ని. సొంతంగా ట్రాక్టర్ కొనాలని మస్తు కలలు ఉండె. దళితబంధు పథకం కింద నేను ఎంపికయ్యాను. నాకు రూ.10 లక్షలు మంజూరు కావడంతోని ట్రాక్టర్‌ను కొనుక్కుని కల నెరవేర్చుకున్నా. నా పొలం దున్నుకోవడంతో పాటు పోయిన వానకాలం, యాసంగిల ఇతరుల పొలాల దుక్కులు దున్నడంతో అన్ని ఖర్చులు పోను మూడు లక్షలు మిగిలినయ్. చాలా సంతోషంగా అనిపించింది. నా పొలంతో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్న. దళితబంధు పథకం వల్ల మా లాంటి దళితులకు మంచి రోజులు వచ్చాయి.
– బేగరి రాజు, బంజపల్లి, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
నా పేరు కళావతి. నిరుపేద కుటుంబం మాది. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు పెళ్లి పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయి తిరిగి నిజాంసాగర్లోని పుట్టింటికి వచ్చేశా. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొనేదాన్ని. ఈ పరిస్థితుల్లో దళితబంధు కింద రూ.10లక్షలు వచ్చింది. ఈ పైసలతోని ఏం చేయాల్నో అర్థం కాలేదు. జనరల్ స్టోర్, లేడీస్ ఎంపోరియం పెట్టుకోవాలని తెలిసినోళ్లు సలహా ఇచ్చిండ్రు. కూర్చున్న దగ్గర సంపాదించవచ్చని జనరల్ స్టోర్ పెట్టుకున్న. దేవుడి దయతో నా దుకాణం మంచిగా నడుస్తున్నది. నా ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న. ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటున్న. నా జీవితం ఏమైపోతదోననే భయం ఉండేటిది. దళితబంధుతో ఆ భయం పోయింది. ఇప్పుడు ఎంతో స్వాభిమానంతో వ్యాపారం చేసుకుంటున్న. నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. (ఈ విషయం చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది) నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా
నాది మహ్మద్‌నగర్ గ్రామం. మొన్నటిదాకా కూలికెళ్తుంటి. పౌల్ట్రీఫాంలనే పనిచేసేటోడ్ని. బాసన్లు తీసుకొని ఊరూరా అమ్మేటోన్ని. నాకు ముగ్గురు పిల్లలు. ఇంటి ఖర్చులు పోను పిల్లలను చదివించుడు మస్తు కష్టమైతుండె. దళితబంధు పథకం వచ్చినంక నేను పౌల్ట్రీఫాం కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలకు తోడు నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి రూ.15 లక్షలతోని ఐదువేల కోళ్లు పెంచేలా సొంత భూమిల పౌల్ట్రీఫాం పెట్టుకున్నా. జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభరాజు మేడం ఐదు నెలల కిందట ప్రారంభించారు. ఇప్పటికే రెండు బ్యాచుల కోళ్లను అమ్మేసిన. అన్ని ఖర్చులు పోను 70 వేలు మిగిలాయి. జీవితంలో పౌల్ట్రీఫాం ఏర్పాటు చేస్తానని అనుకోలే.
– దాసరి సాయిలు, మహ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
నేను, నా భర్త మల్దొడ్డి రత్నయ్య ఇద్దరం కూలీపనులకు వెళ్లేటోళ్లం. నిరుడు మా ఆయనకు పక్షవాతం వచ్చి మూలనవడ్డాడు. ఆయనకు దవాఖానల చూపించాలి. ఇంటి ఖర్చులను భరించాలి. రూపాయి ఆదాయం లేకపాయె. కూలీకి పోతే తప్ప కడుపు నిండదాయె. బతుకుమీద విరక్తి పుట్టేటిది. అటు సంతానం లేకపోవుడు.. మస్తు బాధ అనిపిస్తుండె. కష్టాలన్ని సుట్టిముట్టినయ్ అనుకుంటున్నప్పుడే దళితబంధు పథకం కింద నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇస్తున్నరని తెలిసింది. నాకు మస్తు సంతోషమనిపించింది. తెలిసినోళ్ల సాయంతోని దరఖాస్తు చేసుకున్న. నయా పైసా ఖర్చు లేకుండా నాకు దళితబంధు కింద రూ.10 లక్షలు అందినయ్. ఆ పైసలతో ఏం చేయాలో తెల్వలేదు. కొందరు తెలిసినోళ్లు చెప్పినట్లు విని కారును కొన్నా. డ్రైవర్‌ను మాట్లాడుకొని కిరాయికి ఇస్తున్నా. నెలానెలా డబ్బులు అస్తున్నాయి. డీజిల్, డ్రైవర్ జీతం పోను ఇంటి అవసరాలకు సరిపడా పైసలు అందుతున్నయ్. ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా బతుకుతున్నాం. ఈ కారు మా ఆయనను దవాఖానకు తీసుకుపోయేతందుకు కూడా ఉపయోగపడుతున్నది.
– మల్దొడ్డి ప్రమీల, మహ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
నేను నా భార్య గతంలో ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్లం. నెలంతా పనిచేసినా మాకు అందే జీతం అంతంతమాత్రంగానే ఉండేది. పైగా యాజమాన్యాలు ఇచ్చే లక్ష్యాలను చేరుకోవాల్సిందే. కొన్నిసార్లు నెలల తరబడి జీతం అందేది కాదు. దీంతో ఉద్యోగం మానేశాం. ఇంతలోనే దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి యూనిట్ మంజూరైంది. నేనూ నా భార్య కలిసి రూ.10 లక్షలతో ఇంటర్నెట్ సెంటర్, శారీ రోలింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. నెలకు సుమారు రూ.60 వేల చొప్పున ఆదాయం వస్తున్నది.
– దూమాల మధుసూదన్, అనంతసాగర్, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
మాది బంజపల్లి. నేను హెవీ లారీల్లో క్లీనర్‌గా పనిచేస్తుంటి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు లారీలో వెళ్తుంటిమి. నెల రోజుల దాంకా ఇంటికి రాకపోతుంటి. క్లీనర్‌గా నెలకు 6 వేల జీతం ఇస్తుండే. ఇదేమి జీవితమని మస్తు బాధ పడుతుంటి. సొంతంగా ఓ వాహనం తీసుకోవాలనే కలలు ఉండేవి. నా కలలను కేసీఆర్ సారు నిజం చేశారు. ఆయన దళితబంధు కింద 10 లక్షలు ఇవ్వడంతో బొలేరో వాహనం కొనుక్కున్న. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని ఓ కంపెనీలో ఎంగేజ్ పెట్టిన. నేనే డ్రైవర్‌గా ఉండి నెలనెలా ఎంగేజ్ సొమ్మును తీసుకుంటున్న. అన్ని ఖర్చులు పోను నాకు నెలకు 30 నుంచి 40 వేలు మిగులుతున్నాయి.
– మంత్రి మల్లేశ్, బంజపల్లి, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
గతంలో మూడేండ్లు ఓ ప్రవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేశాను. అక్కడ చాలీచాలని జీతం. జీవితం మీద విరక్తి పుట్టేది. ఆ సమయంలోనే దళితబంధు ప్రకటన వచ్చింది. దీంతో నాకు జీవితంపై ఆశలు చిగురించాయి. పథకంలో భాగంగా నాకు ఆటోమొబైల్ షాపు యూనిట్ మంజూరైంది. దుకాణం ద్వారా రోజుకు కనీసం రూ.వెయ్యి చొప్పున సంపాదిస్తున్నాను. చిరుద్యోగినైన నేను ఆటోమొబైల్ షాపునకు యజమాని అయ్యానంటే నమ్మలేకుండా ఉంది.
– నాదెళ్ల సంతోష్‌కుమార్, ఆటోమొబైల్స్ దుకాణ యజమాని, తిమ్మినేనిపాలెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా