మూసాపేట : ఈ నెల 27 న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభ సందర్భంగా దళితబంధు లబ్దిదారులు (Dalit Bandhu beneficiaries) బీఆర్ఎస్కు రూ. 32,500 నగదును మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి అందజేశారు. పార్టీకీ విరాళం ఇచ్చిన వారిలో ఉమ్మడి చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామానికి చెందిన కురుమూర్తి రూ.10 వేలు, ఉంద్యాల గ్రామానికి చెందిన మహిపాల్ రూ. 10, వేలు , కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన మహేందర్ రూ. 5వేలు, డీజె రాజు రూ. 5వేలు, లక్ష్మీదేవిపూర్ గ్రామానికి చెందిన రవి రూ. 2,500 అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పేద ప్రజల పార్టీ అని అన్నారు. తెలంగాణలోని పేద ప్రజలు కష్టాలను చూసిన కేసీఆర్( KCR ) దూరం చేయాలని లక్ష్యంతోనే గులాబీ పార్టీని ప్రారంభించినట్లు చెప్పారు. ఆ దిశగా పోరాడి తెలంగాణను సాధించినట్లు చెప్పారు. కేసీఆర్ పాలన ముగిసిన వెంటనే కరెంటు కోతలు, సాగునీటి ఎత్తిపోతలు నిలుపుదల బటన్ బంద్ చేసినట్లుగా ఆగిపోయినట్లు ఆరోపించారు.
ఉమ్మడి పాలనలో పంటలు ఎండి కరువచ్చిన రోజులు చూసిన, మళ్లీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఎండిన పంటలను చూసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్న దళిత బంధు కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించారని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల్లో వెనుకబాటుతనానికి గురైన దళితులను ఎవరు కూడా గుర్తించలేదని కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే దళితులను ధనవంతులను చేయాలని సంకల్పంతో దళిత బంధు పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఆ పథకంతో చాలామంది కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు.