ఆమనగల్లు, సెప్టెంబర్ 18: మూడు నెలలుగా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాల్లో పాడి రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పాడి రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారికి ర్యాలీగా చేరుకుని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో రోడ్డుపై పాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ లలితకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నేనావత్ అనురాధ, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్‌గుప్తా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 రోజులకోసారి బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో ట్రాక్టర్లతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.