జనగామ : కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు(Dairy farmers )కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. పాల బిల్లులు చెల్లించడం లేదంటూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై పాల డబ్బాలతో పాడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
పెండింగ్ బిల్లుల కోసం(Milk bills) పలుమార్లు ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. తమ గురించి ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించుకుండా ప్రజాప్రతినిధులు తమ గొప్పలను ప్రదర్శించేందుకు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
మా బతుకు దెరువు పాడి అని, పాడితోనే బతుకులీడుస్తున్నామని, పాలబిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం తమను రోడ్డు పాలు చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.