ఇల్లెందు/ భద్రాచలం/ మణుగూరు టౌన్, అక్టోబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 36 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులు పది నెలలుగా వేతనాలు లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇల్లెందు మండలం రొంపేడు గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట చేస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు మద్దతు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ కార్మికుల వేతనాలు తగ్గించడం చట్ట వ్యతిరేకమని, దేశ చరిత్రలో ఇటువంటి దుర్మార్గం ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు దిగి రాకపోతే ప్రజాప్రతినిధుల ఇండ్లను సైతం సీఐటీయూ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నా చేశారు.
మహాముత్తారం, అక్టోబర్ 17 : దళిత మహిళను కులం పేరుతో దూషించి దాడి చేసిన ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గండికామరాం గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు గ్రామానికి చెందిన పకల శంకరమ్మను కలిసి వివరాలు తెలుసుకున్నారు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణ కులస్థులు.. ఇంట్లో ఉన్న శంకరమ్మను బయటికి లాక్కొచ్చి రోడ్డుపై పడేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారని, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కోసం గ్రామానికి వెళ్లి పలువురు వ్యక్తులను కలిసి జరిగిన విషయంపై ఆరా తీయగా.. మచ్చిక సారంగపాణి, మచ్చిక కొమరమ్మ, మంచిక ఐలయ్య.. శంకరమ్మను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి.. మా అగ్రవర్ణ కులాల్లో నీ ఒకదానివే కల్తీ.. తకువ జాతి దానివి’ అంటూ విపరీతంగా కొట్టారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు పెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.